Mana Enadu : ఏపీలో జాతీయ రహదారులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. భారతమాల పరియోజన (Bharatmala Phase 1)ప్రాజెక్టు మొదటి దశ కింద ఆంధ్రప్రదేశ్‌కు 7 జాతీయ రహదారులు మంజూరైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ రహదారుల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులు గతేడాదే మంజూరైనా వాటి టెండర్ల ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం స్తంభింపజేసింది.
7 జాతీయ రహదారులకు గ్రీన్ సిగ్నల్
తాజాగా ఏకకాలంలో అన్నింటినీ ప్రారంభించడానికి రహదారులు, రవాణాశాఖ (Roads And Transport Ministry) ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ కార్యదర్శికి లేఖ రాసింది. మొదట ఈ రహదారుల నిర్మాణానికి 6 వేల 646 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసింది. అయితే మొత్తం 384 కిలో మీటర్ల పొడవైన వీటి నిర్మాణ వ్యయాన్ని ప్రస్తుతం 6 వేల 280 కోట్ల రూపాయలకు తగ్గించింది. ఈ ప్రాజెక్టుల్లో కొండమోడు – పేరేచెర్ల సెక్షన్ విస్తరణ సైతం ఉంది.
వారికే టెండర్లు
ఇక ఈ ఏడు ప్రాజెక్టుల్లో తొలి రెండు ప్రాజెక్టులకు ఇది వరకే టెండర్లు (National Highways Tenders) పిలిచారు. ఈ మేరకు ఇద్దరు ఎల్-1గా నిలవగా.. ఆ రెండు సంస్థలు కోట్ చేసిన మొత్తానికే తాజా ధరలను నిర్ణయించి అంచనాలను సవరించారు. కొండమోడు-పేరేచెర్ల రహదారి విస్తరణలో భాగంగా దానికి అనుబంధంగా సత్తెనపల్లి, మేడికొండూరుల వద్ద రెండు బైపాస్ రోడ్లు నిర్మించనున్నట్లు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు వెల్లడించారు.
ఏపీకి మంజూరైన 7 జాతీయ రహదారుల (7 National Highways in AP) వివరాలు ఇవే
NH167 ఏజీలో 49.917 కిలో మీటర్ల మార్గాన్ని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. దీనికి రూ. 881.61 కోట్ల వ్యయం అంచనా వేశారు.
NH167కెలో సంగమేశ్వరం – నల్ల కాలువ, వెలిగొండ – నంద్యాల మధ్య మార్గాన్ని రెండు వరుసలుగా విస్తరిస్తారు. ఇందుకోసం రూ. 601 కోట్ల వ్యయం కానున్నారు.
NH167కెలో నంద్యాల-కర్నూలు/కడప బోర్డర్ సెక్షన్‌ను 62 కిలో మీటర్ల మేర రూ. 691 కోట్లతో ఆధునికీకరించనున్నారు.
NH440లో వేంపల్లి నుంచి చాగలమర్రి వరకు (ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు మీదుగా) ఉన్న రహదారిని రెండు, నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. 78.95 కిలోమీటర్ల ఈ రహదారి విస్తరణకు రూ. 1,321 కోట్లు వెచ్చించనున్నారు.
NH716జిలోని ముద్దనూరు-హిందూపురం సెక్షన్‌లో రహదారిని నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. 33.58 కిలోమీటర్ల మార్గం విస్తరణకు రూ. 808 కోట్ల ఖర్చు పెట్టనున్నారు.
NH716జిలో ముద్దనూరు నుంచి బి.కొత్తపల్లి సెక్షన్ వరకు 56.5 కిలోమీటర్ల మార్గాన్ని నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. దీనికి రూ.1,019.97 కోట్లు వ్యయం కానుంది.
NH 516బిలో పెందుర్తి నుంచి ఎస్.కోట మార్గంలో ఉన్న రోడ్డును 2, 4 వరుసలుగా విస్తరించనున్నారు. 40.5 కిలోమీటర్ల ఈ రహదారి విస్తరణకు రూ. 956.21 కోట్లు వెచ్చిస్తారు.






