Mana Enadu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరణుడు మరోసారి వణికిస్తున్నాడు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు (AP Rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు వర్షాలు-వరదలపై సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu) ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
బలపడిన వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు (AP Floods) పడుతున్నాయి. తీవ్ర అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రం వాయుగుండంగా బలపడి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా తీరాల వైపు పయనిస్తోంది. గురువారం రోజున ఇది పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరాన్ని తాకవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆ జిల్లాలకు ఆకస్మిక వరదలు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ముందుస్తు హెచ్చరికలు జారీ చేశారు. బుధ, గురువారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. గరిష్ఠంగా గంటకు 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు.
ఆ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు
బుధవారం రోజున శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు (Heavy Rains in AP) కురుస్తాయని.. అనంతపురం, శ్రీసత్యసాయి, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఇక గురువారం రోజున (అక్టోబర్ 17వ తేదీ) శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలున్నాయని వెల్లడించారు.