Mana Enadu: సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో తల్లికి చెందిన ఆభరణాలు ఆమె తదనంతరం తోబుట్టువులు పంచుకుంటారు. కొన్నిసార్లు ఈ విషయంలో వివాదాలు తలెత్తి కుటుంబాల మధ్య దూరం కూడా పెరుగుతుంది. ఇది కేవలం సాధారణ ఫ్యామిలీస్ లోనే కాదండోయ్ దేశాన్నే శాసించే రాజకుటుంబాల్లోనూ ఇలాంటి వివాదాలు ఉంటాయట. బ్రిటన్ రాజకుటుంబంలో జరిగిన ఈ విషయాన్ని చూస్తే నిజమేననిపించక మానదు. ఇంతకీ ఆ కుటుంబంలో ఏం జరిగింది..?
బ్రిటన్ రాజకుటుంబం గురించి ఏ వార్త బయటకొచ్చినా అది సెన్సేషనే. అక్కడ ఏం జరిగినా అందరికీ ఆసక్తే. బ్రిటన్ ప్యాలస్ విషయాలెప్పుడూ ఐ క్యాచింగ్ గా , వినసొంపుగానే ఉంటాయి. చివరకు ఆ కుటుంబ వివాదాలు కూడా. అయితే ఈ రాజకుటుంబంలో తల్లి నగల కోసం ఇద్దరు రాజకుమారుల మధ్య విభేదాలు తలెత్తాయట.
ఇంగ్లండ్ రాకుమారుడు విలియం, అతడి సోదరుడు ప్రిన్స్ హ్యారీతో విబేధాలు తలెత్తాయనే వార్తలు గతంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నటి మేఘన్ మార్కెల్‌తో హ్యారీ వివాహం, రాజకుటుంబాన్ని వదిలి హ్యారీ వెళ్లిన సమయంలోనూ ఇవి బయటపడ్డాయి. అయితే వారి తల్లి ప్రిన్సెస్ డయానా ఆభరణాలను మేఘన్ ధరించకుండా విలియం అడ్డుకున్నారని రచయిత రాబ్ జాబ్సన్ రాసిన ‘కేథరీన్, ది ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్’ పుస్తకంలో పేర్కొనడం ఇప్పుడు సంచలనంగా మారింది.
రాబ్ జాన్సన్ తన పుస్తకంలో ప్రిన్స్ హ్యారీకి వివాహం కాకముందు రాజకుటుంబం గురించిన విషయాలు వెల్లడించారు. అందులో ఆయన… హ్యారీ ప్రేమను రాజకుటుంబం వ్యతిరేకించింది. ఫలితంగా ఇరువురు సోదరుల మధ్య విభేదాలు వచ్చాయి. మేఘన్ కు రాజకుటుంబ పద్ధతులు, జీవన విధానం, సంప్రదాయాలు తెలుసుకోవడానికి కొంత సమయం ఇచ్చి.. ఆ తర్వాత వివాహం జరిపిస్తామని విలియం చెప్పిన మాటలు హ్యారీకి నచ్చలేదు. వాటిని బేఖాతరు చేసి ఆమెను పెళ్లాడాడు. దీంతో సోదరుల మధ్య బంధం మరింత దెబ్బతింది. అని రచయిత తన పుస్తకంలో తెలిపారు.
అయితే ప్రిన్సెస్ డయానా ఎంగేజ్ మెంట్ రింగ్ ను ప్రిన్స్ విలియం గతంలో కేట్ మిడిల్టన్కు ఇచ్చి ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత హ్యారీ తను ప్రేమించిన మేఘన్ ను వివాహమాడే సమయంలో మాత్రం ఆమె రాజకుటుంబానికి చెందిన అమ్మాయి కాదని.. డయానాకు సంబంధించిన ఆభరణాలు మెర్కెల్‌కు ఇవ్వడానికి నిరాకరించారు. వేల్స్ యువరాణి డయానా ధరించిన ఆభరణాలను తన భార్య కేట్ మాత్రమే వినియోగించాలని విలియం బలంగా భావించాడు. అని రచయిత తన పుస్తకంలో పేర్కొన్నారు.
ఇక బ్రిటన్ రాజ కుటుంబ సభ్యుడిగా తాను ఎదుర్కొన్న అనుభవాల గురించి హ్యారీ ‘స్పేర్’ పేరిట గతేడాది ఆటో బయోగ్రఫీ రాసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ బుక్ లో హ్యారీ రాసిన కొన్ని విషయాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. తన ఫ్యామిలీ తననెప్పుడూ స్పేర్(అదనం)గానే చూసేదని అందులో రాసుకొచ్చారు.