ManaEnadu:మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల గురించి జస్టిస్ హేమ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు ఏడాది తర్వాత ఈ నివేదిక బయటకు వచ్చింది. ఈ క్రమంలో బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తూ తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియాకు వెల్లడిస్తున్నారు. తాజాగా ఓ మాలీవుడ్ నటి జాతీయ మీడియాకు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని షేర్ చేసుకున్నారు.
నలుగురు సహచర నటులు తనను లైంగికంగా వేధించారని, అసభ్యకరంగా దూషించారని ఆమె తెలిపారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో జయసూర్య అనే నటుడు తనను వేధింపులకు గురి చేశాడని వెల్లడించారు. తాను వాష్ రూమ్ కు వెళ్లి వస్తుండగా అతను వెనక నుంచి వచ్చి తనను హగ్ చేసుకుని ముద్దు పెట్టాడని చెప్పారు. తనతో ఉంటే ఎక్కువ అవకాశాలు కల్పిస్తానని అన్నాడని పేర్కొన్నారు.
“మలయాళీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో సభ్వత్వం గురించి అసోసియేషన్ సెక్రటరీ ఇడవేల బాబును సంప్రదిస్తే ఇంటికి రమ్మని చెప్పాడు. ఆయన నివాసానికి వెళితే శారీరకంగా వేధించాడు. నటుడు, సీపీఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎం.ముకేశ్, మణియన్పిళ్ల రాజుపై కూడా నన్ను వేధించాడు. అన్నింటినీ తట్టుకుని సినిమా కోసం పని చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ వేధింపులు మితిమీరాయి. మలయాళం చిత్ర పరిశ్రమను వదిలి చెన్నైకు వెళ్లిపోయేలా చేశారు. ఈ సంఘటన వల్ల నేను మానసికంగా ఎంతో కుంగిపోయాను. న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. వారు చేసిన పనికి తగిన శిక్ష అనుభవించాలి.” అని సదరు నటి పేర్కొన్నారు.
ఈ నటి ఆరోపణలపై నటుడు మణియన్పిళ్ల రాజు స్పందిస్తూ.. ఆమె ఆరోపణల వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. కొంతమంది పరిస్థితులను వాడుకోవడానికి ప్రయత్నిస్తారని .. ఆమె ఆరోపించిన వ్యక్తుల్లో అమాయకులతో పాటు నిందితులు ఉంటారని పేర్కొన్నారు. ఆమె ఆరోపణలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.