ManaEnadu:కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. అయినా ఆందోళనలు తగ్గుముఖం పట్టడం లేదు. అయితే ఇప్పటికే ఓ అమ్మాయిపై జరిగిన అఘాయిత్యంపై దేశమంతా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తుంటే.. ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఓ వ్యక్తి ఏకంగా ఎంపీ కూతురినే అత్యాచారం చేస్తామని బెదిరించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
కోల్ కతా వైద్య విద్యార్థిని ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు కొనసాగుతుండగా.. ఈ ఆందోళనల్లో పాల్గొన్న ఓ వ్యక్తి.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కుమార్తెను అత్యాచారం చేసిన వారికి భారీ రివార్డు అందజేస్తానని బెదిరించాడు. ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున కలకలం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పోలీసులను రంగంలోకి దింపింది. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
‘‘కోల్ కతా డాక్టర్ పై హత్యాచార ఘటనపై నగరంలో నిరసనలు జరుగుతున్నాయి. ఇందులో పాల్గొన్న ఓ వ్యక్తి ఎంపీ అభిషేక్ బెనర్జీ మైనర్ కుమార్తెపై అత్యాచారం చేస్తామని బెదిరించినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. అంతేకాకుండా అలా చేసిన వ్యక్తికి భారీ నగదు అందజేస్తానని బహిరంగంగా ప్రకటించాడు. ఈ వ్యాఖ్యల్లో అతడి నీచమైన ఉద్దేశం కనిపిస్తోంది. అవి సదరు మైనర్ బాలిక గౌరవానికి భంగం కలిగించడంతోపాటు చిన్నారి భద్రతకు ముప్పు కలిగించేవి’’ అని పశ్చిమ బెంగాల్ బాలల పరిరక్షణ కమిషన్ పేర్కొంటూ.. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీసులను కోరింది.