ManaEnadu:తెలుగు రాష్ట్రాలను వరణుడు (Telangana Rains) ఇంకా వీడటం లేదు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం అర్ధరాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. సిద్దిపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి, కుమురం భీం ఆసిఫాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది.
మరోవైపు మొన్న కురిసిన వర్షానికి ఇప్పటికీ చాలా చోట్ల వరదలు (Telangana Floods) తగ్గలేదు. ఇళ్లు, పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, పలు వ్యాపార సముదాయాల్లో ఇంకా వరద నీరు నిలిచి ఉంది. ఇక ఇప్పటికే వరద ముంపుతో సతమతమవుతుంటే వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త నెత్తినేసింది. మరో అల్పపీడనం పొంచి ఉందని, దాని ప్రభావంతో మరో రెండ్రోజులు తెలుగు రాష్ట్రాలకు వర్షాలుంటాయని తెలిపింది. దీంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
మరోవైపున ఇప్పటికే వరదలు, మరో రెండ్రోజుల్లో వర్షాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు (School Holidays) ప్రకటించారు. ఇంటి వద్ద కాలనీల్లో, పాఠశాలల్లో వరద ప్రహహం తగ్గకపోవడం తో చాలా పాఠశాలలను మూసివేశారు. మరో మూడ్రోజుల పాటు విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు బుధవారం నుంచి శుక్రవారం వరకు (శనివారం గణేశ్ చతుర్థి (Ganesh Chaturthi) హాలిడే + సండే) మొత్తం ఐదు రోజులు వరసుగా సెలవులు ఇచ్చారు.
పరిస్థితులను బట్టి సోమవారం నుంచి పాఠశాలలు తెరవాలని ఆయా జిల్లాల కలెక్టర్లు పాఠశాలల యాజమాన్యాలకు తెలిపారు. అన్ని విద్యాసంస్థలు సెలవులను కచ్చితంగా పాటించాలని, ఈ సమాచారాన్ని వెంటనే విద్యార్థులు, తల్లిదండ్రులకు చేరవేయాలని కలెక్టర్లు (Collectors) ఆదేశించారు. వరదల్లోనూ ఎవరైనా పాఠశాలలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థుల ప్రాణాలు, వారి ఆరోగ్యమే ముఖ్యమని చెప్పారు.