ManaEnadu:తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మూడు విడతల్లో చెప్పినట్లుగానే రూ.2 లక్షల రుణమాఫీ చేసింది. అయితే సాంకేతిక కారణాల వల్ల అర్హత ఉన్నా కొంతమందికి రుణం మాఫీ కాలేదు. అలాగే రూ.2 లక్షలకు పైగా రుణం తీసుకున్న వారికి కూడా మాఫీ జరగలేదు.
ఈ నేపథ్యంలో తమకు రుణమాఫీ అవుతుందో కాదోనని అన్నదాతలు ఆందోళన చెందుతుండగా.. వారి అనుమానాలు నివృత్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే రైతు వేదికల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసింది. మరోవైపు ఆయా మండల వ్యవసాయ అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించింది. ఇక రైతుల నుంచి అర్జీల స్వీకరణకు శ్రీకారం చుట్టింది.
రుణమాఫీ కోసం ఎక్కడ అర్జీ పెట్టుకోవాలంటే..?
రుణమాఫీ వర్తించని రైతులు మండల కేంద్రాల్లోని రైతు వేదిక, వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఆయా కర్షకుల సౌకర్యార్థం మండల వ్యవసాయ అధికారి(ఏఓ)ని ప్రభుత్వ నోడల్ అధికారిగా ఏర్పాటు చేసింది. ఆధార్‌కార్డు, పట్టాపాసు పుస్తకం, బ్యాంకు ఖాతా జిరాక్సు పత్రాలు జత చేసి తెల్లకాగితంపై రైతు వివరాలు రాసి ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఎవరు దరఖాస్తు చేసుకోవాలంటే..?
ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతాలో పేరు తేడా ఉన్నవారు
చెల్లుబాటులో లేని బ్యాంకు ఖాతా సమస్య ఉన్నవారు
పట్టాపాసు పుస్తకం నమోదుకాని వారు
ఆధార్ నంబర్ తప్పుగా ఉన్నవారు
కుటుంబ నిర్ధారణ సరిగ్గా లేనివారు
కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి, ఫించను తీసుకునే వారు ఉండటం
కటాఫ్ తారీఖు లోపల బ్యాంకులో రుణం లేకపోవటం
రేషన్‌కార్డు లేనివారు
పైన చెప్పిన కారణాలతో రుణమాఫీ పొందని వారు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.