వర్షాకాలంలో భారీ వర్షాలు, కుండపోత కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు, దోమల వ్యాప్తితో పలు ఇన్ఫెక్షన్లు, వ్యాధుల ముప్పు పొంచి ఉంటుంది. వర్షాలతో ఎక్కువ రోజులు నీరు నిలిచిఉండటంతో దోమలు వ్యాప్తి చెంది డెంగ్యూ ముప్పు కూడా అధికమవుతుంది.
న్యూఢిల్లీ : వర్షాకాలంలో భారీ వర్షాలు, కుండపోత కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు, దోమల వ్యాప్తితో పలు ఇన్ఫెక్షన్లు, వ్యాధుల ముప్పు పొంచి ఉంటుంది. వర్షాలతో ఎక్కువ రోజులు నీరు నిలిచిఉండటంతో దోమలు వ్యాప్తి చెంది డెంగ్యూ ముప్పు కూడా అధికమవుతుంది. డెంగ్యూ బారినపడితే సకాలంలో వైద్యసాయం పొందడంతో పాటు తగినంత విశ్రాంతి, మంచి ఆహారం కూడా వేగంగా కోలుకునేందుకు అవసరం.
డెంగ్యూ నుంచి సత్వరమే కోలుకునేందుకు తీసుకోవాల్సిన ఆహారంపై డైటీషియన్ గరిమ గోయల్ తన ఇన్‌స్టాగ్రాం పేజ్ డైటీషియన్‌గరిమలో పలు సూచనలు చేశారు. డెంగ్యూ నుంచి కోలుకునే క్రమంలో జామ పండు నిజమైన సూపర్‌స్టార్‌గా గరిమ సూచించారు. విటమిన్ సీ పుష్కలంగా ఉండే జామలో రోగనిరోధక వ్యవస్ధను ప్రేరేపించే పదార్ధాలూ ఉంటాయి. డెంగ్యూతో దెబ్బతినే రోగనిరోధక వ్యవస్ధను పునరుత్తేజం చేసేందుకు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ విటమిన్ సీ జామలో మెండుగా ఉంటుంది.
దాంతోపాటు ఈ పండులో ఉండే సహజమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం కలిగిన క్వెరసిటిన్ జ్వరం, ఒళ్లు నొప్పుల వంటి లక్షణాలను తగ్గిస్తుంది. ఇక బ్రకోలి, పాలకూర వంటి ఆకుకూరలు, కాయగూరల్లో విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ కే, ఫోలేట్ వంటి విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండటంతో పాటు వీటిలో యాంటీఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి.
రోజువారీ ఆహారంలో ఆకుకూరలతో పాటు తాజా కూరగాయలను భాగం చేసుకోవాలి. ఇక డెంగ్యూకు తరాల తరబడి సహజమైన ఔషధంగా పపాయా ఆకులను వాడుతుంటారు. పపాయ ఆకుల్లో పపైన్, చిమోపపైన్ వంటి ఎంజైమ్‌లు అధికంగా ఉండటంతో ఇవి ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడంతో పాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగిఉంటాయని గరిమ చెబుతున్నారు. కూరగాయలతో సూప్స్ తరచూ తీసుకోవడం, డీహైడ్రేషన్‌ను నివారించేందుకు కొబ్బరి నీళ్లు తాగడం మేలని ఆమె సూచించారు.