గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో ఒక హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. నవరంగ్‌పురాలో ఉన్న సోమ్ లలిత్ స్కూల్‌కు చెందిన 16 ఏళ్ల 10వ తరగతి విద్యార్థిని స్కూల్ బిల్డింగ్ నాల్గవ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం ఇంటర్వెల్ సమయంలో చోటుచేసుకుంది.
క్లాస్‌లో చురుకుగా ఉండే ఈ బాలిక ఆ సమయంలో చేతిలో కీ చైన్ తిప్పుకుంటూ కూల్‌గా నడుచుకుంటూ కనిపించిందని సహపాఠులు చెబుతున్నారు. అయితే ఒక్కసారిగా ఆమె నాలుగో అంతస్థు వైపు వెళ్లి దూకేసింది. ఈ దృశ్యం అక్కడే ఉన్న విద్యార్థులను షాక్‌కు గురిచేసింది. వారు అడ్డుకునేలోపే ఆమె కిందకు దూకేసింది.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో బాలిక కీ చైన్ తిప్పుతూ నడుస్తూ వచ్చి, మెల్లగా బిల్డింగ్ అంచు వద్దకు వెళ్లి పైకి ఎక్కి దూకడం స్పష్టంగా కనిపిస్తోంది.
బాలిక కిందకు దూకిన వెంటనే తలకు తీవ్ర గాయాలయ్యాయి. కొంతమంది విద్యార్థులు చూసేలోపే ఘటన జరిగిపోయింది. స్కూల్ సిబ్బంది వెంటనే ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలించే ప్రయత్నాల్లో అదే రోజు రాత్రి 10 గంటలకు ఆమె మృతిచెందింది.
#Gujarat #Ahmedabad tragedy: A 16‑year‑old Class 10 student at Som Lalit School jumped from the 4th floor lobby during recess on July 24. CCTV showed her twirling a keychain moments before. Friends tried to stop her, but she jumped. 1/2 pic.twitter.com/Whu6R6jwMt
— Siraj Noorani (@sirajnoorani) July 25, 2025
విద్యార్థిని కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోందని స్కూల్ అధికారులు తెలిపారు. ఆమె ఇటీవలే ఒక నెల పాటు లాంగ్ మెడికల్ లీవ్ తీసుకుని 15 రోజుల కిందటే తిరిగి స్కూల్‌కు వచ్చిందని వెల్లడించారు. సంఘటన జరిగిన రోజూ ఆమె తరగతిలో బాగా బాధతో కనిపించిందని, ఒక్కసారిగా గట్టిగా అరచిందని ప్రిన్సిపాల్ లీనా అరోరా వివరించారు.
నవరంగ్‌పురా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇన్‌స్పెక్టర్ ఎ.ఎ. దేశాయ్ తెలిపిన వివరాల ప్రకారం, విద్యార్థిని మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బందిని విచారిస్తున్నారు. మృతురాలు నరన్‌పురా ప్రాంతానికి చెందినవారని చెప్పారు.
ఈ ఘటన తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బంది, విద్యార్థుల్లో తీవ్ర కలకలం రేపింది. బాలిక ఆత్మహత్యకు కారణాలు తెలియకపోవడంతో వారి ఆవేదన మరింత తీవ్రమవుతోంది. ప్రస్తుత విద్యా ఒత్తిళ్లు, మానసిక ఆరోగ్య సమస్యలు ఇలా విద్యార్థులపై ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ పిల్లల మనస్థితిని అర్థం చేసుకునే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉంది.






