
ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు (Delhi Assembly Sessions 2025) రెండో రోజు కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజు సమావేశాల్లోనూ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇవాళ ఉదయం సభ ప్రారంభం కాగానే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా (Delhi LG Speech) ప్రసంగం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతుండగానే.. ఆప్ (AAP) నేతలు నిరసనకు దిగారు. సీఎం కార్యాలయం నుంచి బీఆర్ అంబేడ్కర్, భగత్ సింగ్‌ల ఫొటోలు తొలగించారంటూ ప్రతిపక్ష ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు ఆందోళన చేపట్టడంతో స్పీకర్ విజేందర్ గుప్తా వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు.
12 ఆప్ ఎమ్మెల్యేలు సస్పెండ్
మాజీ సీఎం, ప్రతిపక్ష నేత ఆతిశీ సహా 12 మంది విపక్ష ఎమ్మెల్యేల (12 AAP MLAs)ను ఒకరోజు పాటు అసెంబ్లీకి రాకుండా స్పీకర్ సస్పెండ్ చేశారు. మరోవైపు లిక్కర్ స్కామ్ (Delhi Excise Scam Case)పై కాగ్ ఇచ్చిన నివేదికను నేడు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఆమ్‌ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం అనుసరించిన మద్యం విధానంపై అవకతవకలు రావడంతో దీనిపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) ఆడిట్ చేసిన విషయం తెలిసిందే.
కాగ్ నివేదికలో కీలక విషయాలు
నిపుణుల అభిప్రాయాలు తీసుకోకపోవడం వల్ల ఈ మద్యం విధానం కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.2,026 కోట్ల నష్టం వాటిల్లినట్లు కాగ్ నివేదిక (CAG Report) తేల్చినట్లు తెలిసింది. మరోవైపు ఫిర్యాదులు వచ్చినా బిడ్డింగును అనుమతించడం, విధానాల రూపకల్పనలో పారదర్శకత లేకపోవడం వంటివి చోటు చేసుకున్నాయని కాగ్ నివేదిక వెల్లడించినట్లు ఇటీవల కథనాలు వచ్చాయి.