
144 ఏళ్లకోసారి వచ్చే మహాకుంభమేళా (Maha Kumbh Mela) ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. నెల రోజులుగా సాగుతున్న ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం చివరి దశకు చేరుకుంది.మహా కుంభమేళాలో మొత్తం ఆరు రాజ స్నానాలు (అమృత స్నానం (Raja Snanam)) జరుగుతాయన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐదు రాజ స్నానాలు (భోగి, మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పౌర్ణమి) రోజు పూర్తయ్యాయి. ఇక చివరి (ఆరవ) రాజస్నానం ఎప్పుడు జరుగనుంది? శాస్త్రోక్తంగా దీన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుందాం.
రాజస్నానం ఎలా చేయాలంటే?
కుంభ మేళాలో చేసే రాజ స్నానాలలో చివరిది (ఆరో రాజస్నానం) మహాశివరాత్రి (Maha Shivaratri) రోజున జరగనుంది. ఫిబ్రవరి 26వ తేదీన రానున్న మహాశివరాత్రి రోజున ఈ అమృత స్నానం ఆచరించాల్సి ఉంటుంది. అదే రోజున మహాకుంభమేళా కూడా ముగియనుంది. మహా కుంభ మేళాలో రాజ స్నానం చేసే వారు ముందుగా గంగమ్మ తల్లికి నమస్కరించి నది ఒడ్డు నుంచి కొంత మట్టి సేకరించి నది లోపలికి ప్రవేశిస్తూ నీటిలో ఆ మట్టిని కలపాలి. ఆ తర్వాత భక్తి శ్రద్ధలతో ముక్కు మూసుకొని మూడు సార్లు నదిలో మునిగి.. దోసిలితో నీరు తీసుకొని తూర్పు తిరిగి సూర్యునికి అర్ధ్యం ఇవ్వాలి.
ఇదే ఆఖరి అవకాశం
అనంతరం నీటిలో నుంచి బయటకు వచ్చి నదిలోకి పసుపు కుంకుమ, పువ్వులు సమర్పించి.. అరటి దొన్నె లో దీపం ఉంచి నదిలో వదిలి నమస్కరించాలి. ఈ విధంగా శాస్త్రోక్తంగా నదీస్నానం (Amrit Snan) పూర్తి చేసిన తరువాత నది తీరంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం చేస్తే పితృదేవతలు సంతోషించి వంశాభివృద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. మహాకుంభమేళాలో స్నానం చేయడానికి ఇదే ఆఖరి అవకాశం కాబట్టి వీలైతే తప్పకుండా ప్రయాగరాజ్ వెళ్లి అమృత స్నానం చేద్దాం. ఓం నమః శివాయ!