
దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు (Maha Shivaratri) ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలు శివనామస్మరణలతో మార్మోగుతున్నాయి. పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు వేకువ జాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ఏపీలోని శ్రీకాళహస్తి, శ్రీశైలం, తెలంగాణలోని వేములవాడ, కీసర (Keesara Temple) ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చి శివయ్యకు పూజలు చేశారు. ఓంనమఃశివాయ అనే నామస్మరణతో దేశవ్యాప్తంగా ఆలయాలు హోరెత్తుతున్నాయి.
కోటప్పకొండపై శివరాత్రి వేడుకలు
ఏపీ పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని కోటప్పకొండ (Kotappa Konda)పై మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున 2 గంటలకు బిందె తీర్థంతో స్వామి వారికి తొలిపూజ ప్రారంభమైంది. అనంతరం ఆలయ పండితులు త్రికోటేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించారు. ఇక తొలిపూజ మహోత్సవాన్ని తిలకించి పరవశించేందుకు ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
రాజన్న సన్నిధిలో భక్తుల కిటకిట
మరోవైపు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి (Vemulawada Temple)కి తెల్లవారు జాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. శివయ్యకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కోడెలు సమర్పించి రాజన్నకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. శివరాత్రి సందర్భంగా భారీ ఎత్తున భక్తులు తరలిరావడంతో వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.