
దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ (ఫిబ్రవరి 26వ తేదీ) ప్రధాని మోదీ (PM Modi)ని కలిశారు. పీఎంవో నుంచి సమాచారం రావడంతో ఆయన మంగళవారం రోజున హస్తినకు వెళ్లారు. గతేడాది జులైలో ప్రధానమంత్రితో సీఎం భేటీ అయిన విషయం తెలిసిందే. ఆరు నెలల తర్వాత ఇప్పుడు పీఎం అపాయింట్మెంట్ దొరికింది.
కేంద్రం సాయం కోరిన సీఎం
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో భేటీ అయిన రేవంత్.. ఆయనకు ఎస్ఎల్బీసీ ఘటన (SLBC Collapse Incident) గురించి వివరించారు. అలాగే పలు ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం సాయం గురించి మాట్లాడారు. మూసీ సుందరీకరణ, శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో ప్రాజెక్టు (Shamshabad Airport Metro), రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు సాయంతో పాటు విభజన చట్టంలోని వివిధ పెండింగ్ సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి.
కేంద్రమంత్రులను కలిసే అవకాశం
ఇక మోదీతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ అగ్ర నేతలను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలు, పీసీసీ రాష్ట్ర కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశాలున్నట్లు తెలిసింది. సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కొందరు అధికారులు ఉన్నారు.