
నాగర్ కర్నూలు జిల్లాలో ఈనెల 22వ తేదీన శైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో (SLBC Collapse Update) చిక్కుకుపోయిన వారిని వెలికితీసేందుకు రెస్క్యూ టీమ్స్ నిరంతరంగా శ్రమిస్తున్నాయి. ఐదు రోజులు గడుస్తున్నా అందులో చిక్కుకున్న ఎనిమిది మంది జాడ తెలియడం లేదు. అయితే సహాయక చర్యల్లో కాస్త పురోగతి కనిపించినట్లు తెలిసింది. మంగళవారం మధ్యాహ్నం సొరంగంలోకి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్‌హోల్ మైనర్స్ సభ్యులు ఎట్టకేలకు మనుషులు వెళ్లగలిగేంత చివరి వరకూ వెళ్లి తిరిగి వచ్చారు.
రెండ్రోజుల్లో వచ్చేస్తారు
ఇక తాజాగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) తెలిపారు. సొరంగమార్గంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు .. రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని వెల్లడించారు. కార్మికులు ఉన్న చోటుకు వెళ్లేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. చిక్కుకున్న వారిని రక్షించేందుకు దేశ సరిహద్దుల్లో టన్నెల్స్ నిర్మించే నిపుణులు, ఎక్కడ టన్నెల్ ప్రమాదం జరిగినా సహాయక చర్యల్లో పాల్గొన్న ఎక్స్‌పర్ట్స్ సాయం తీసుకుంటున్నట్లు వివరించారు.
ప్రాణాలతో బయటకు తీసుకొస్తాం
సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నట్లు చెప్పిన మంత్రి ఉత్తమ్.. గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి దెబ్బతిన్న టీబీఎం (TBM)ను వేరు చేస్తామని తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ పూడికలోకి వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. మట్టి, నీరుతో పేరుకుపోయిన సిల్ట్‌ను పూర్తిగా తొలగించనున్నట్లు పేర్కొన్నారు. కొందరు ప్రకృతి విపత్తును రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకుంటున్నారని మంత్రి మండిపడ్డారు. అలాంటి వారి గురించి తాను మాట్లాడనని స్పష్టం చేశారు. అందులో చిక్కుకున్న 8 మందిని ప్రాణాలతో బయటకు తీసుకురావడమే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు.