సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల వర్కింగ్ అవర్స్ పై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి (Narayana Murthy) గతంలో కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వారానికి కనీసం 70 గంటలు పని చేయాలంటూ సంచలన కామెంట్స్ చేశారు. అలాగే.. వారానికి ఆరు పని దినాల విధానానికే తాను మొగ్గు చూపుతానని తెలిపారు. తాను తుదివరకు ఈ విధానానికే మద్దతు పలుకుతానని తాజాగా ఆయన స్పష్టం చేశారు.
ఐయామ్ సారీ నేను మారలేను
సీఎన్‌బీసీ గ్లోబల్ లీడర్‌షిప్ సదస్సు (CNBC Global Leadership Summit)లో నారాయణమూర్తి మాట్లాడారు. ‘‘ఐ యామ్ సారీ.. నేను నా భావాలను మార్చుకోలేను. వారానికి ఆరు పని దినాలు అని చెప్పిన మాటకు నేను తుది వరకు కట్టుబడి ఉంటాను. ప్రధాని మోదీ (PM Modi) దేశం కోసం ఎంతో శ్రమిస్తున్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ అలా కష్టపడటమే ఆయనకు మనమంతా ఇచ్చే గౌరవం. భారతదేశ అభివృద్ధి.. త్యాగాలు, ప్రయత్నాలపైనే ఆధారపడి ఉంది. బలమైన పని విలువలు లేని దేశం.. ప్రపంచ స్థాయిలో పోటీపడటంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
నేను 14 గంటలు పనిచేశాను..
ఈ సదస్సులో మాట్లాడుతూ.. తన కెరీర్‌లో పడిన శ్రమను వివరించారు నారాయణమూర్తి. ‘నేను రోజుకు 14 గంటల చొప్పున వారానికి ఆరున్నర రోజులు వర్క్ చేసే వాడిని. ఉదయం 6.30 గంటలకు ఆఫీసుకు వెళ్తే రాత్రి 8.40 గంటలకు పని ముగించే వాడిని. ఆ రకంగా కష్టపడి పని చేశాను. ఇంకా చేస్తున్నందుకు గర్వంగా ఉంది. కష్టపడి పని చేయడం చదువుకున్న ప్రతి ఒక్కరి బాధ్యత.’ అని నారాయణమూర్తి పేర్కొన్నారు.
వారానికి 70 పని గంటలు
గతంలో నారాయణమూర్తి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత్‌లో మిలీనియల్స్ వారానికి 70 గంటలు వర్క్ (70 Working Hours) చేయాలని చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్ తో ఆయనపై తీవ్ర విమర్శలు కూడా వెల్లువెత్తాయి. దీనిపై ఆయన స్పందిస్తూ.. ప్రతిభ, తెలివితేటలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడటం ప్రస్తుతం భారతదేశానికి అవసరమని వ్యాఖ్యానించారు.







