విదేశాలలో ఉన్నత విద్య(Study Abroad)ను అభ్యసించేందుకు భారత విద్యార్థుల(Indian Students)కు మోజు తగ్గిపోతోంది. గత ఏడాది డాటా ప్రకారం విదేశాలకు వెళ్లిన విద్యార్థుల సంఖ్యలో 15% తగ్గుదల కనిపించింది. కొవిడ్(Covid) తర్వాత ఇలా తగ్గుదల నమోదవ్వడం ఇదే తొలిసారి. 2023లో వీరు 8,92,989 మంది ఉండగా, 2024 నాటికి 7,59,064కు పడిపోయింది. ముఖ్యంగా, కెనడా, US, UKలకు వెళ్లే వారి సంఖ్య భారీగా తగ్గిపోయిందని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ డాటా(Bureau of Immigration Data) తాజాగా నివేదించింది. 2024లో ఈ 3 దేశాల్లోనే 27% విద్యార్థులు తగ్గినట్టు తెలిపింది.

ఆ మూడు దేశాలకు వెళ్లే వారు పెరిగారు..
ఇందుకు వీసా నిబంధన(VISA Rules)లు కఠినతరం చేయడం, ఎక్కువ మొత్తంలో ఫీజులు(Fees), ఇతర ఆర్థిక డిమాండ్లు, పెరిగిన తిరస్కరణలు, ఆయా దేశాల్లోని దౌత్యపరమైన సమస్యలు కారణమని విశ్లేషించింది. ఇదే సమయంలో ప్రత్యామ్నాయ దేశాలైన రష్యా, జర్మనీ, ఉజ్బెకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరిగింది. బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ వెల్లడించిన డాటా ప్రకారం గత ఏడాదితో పోలిస్తే 2024లో US, UK, కెనడా వెళ్లే విద్యార్థుల సంఖ్య 1,64,370 తగ్గింది. ఇందులో కెనడాకు 41 శాతం అధిక తగ్గుదల నమోదైంది. ఈ దేశానికి 2023లో 2,33,532 మంది వెళ్లగా, 2024లో ఈ సంఖ్య 1,37,608 మాత్రమే వెళ్లారు.






