రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఇవాళ (గురువారం) ఆయన ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ నేతలపై మండిపడ్డారు. గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధముందని.. ఫొటోలు దిగి చూపించుకోవాల్సిన అవసరం లేదని సీఎం అన్నారు. తనెవరో తెలియకుండానే పీసీసీ చీఫ్, సీఎం పదవులకు ఎంపిక చేస్తారా? అని ప్రశ్నించారు.
నేను ఎవరి ట్రాప్‌లో పడను
“నేను ఎవరి ట్రాప్‌లోనూ పడను. నేనేంటో నాకు తెలుసు. మా పార్టీ హైకమాండ్ కు తెలుసు. ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR) గవర్నర్ ప్రసంగానికి రావడం కాదు.. అసెంబ్లీ సమావేశాలకు రెగ్యులర్ గా హాజరవ్వాలి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శ్రద్ధ పెట్టడం లేదు. అందుకే ఆయణ్ను నిరంతరం ప్రశ్నిస్తున్నాను. ‘భారత్ సమ్మిట్’కు క్లియరెన్స్ కోసమే జైశంకర్ (Jai Shankar)ను కలుస్తున్నాను. అందుకే ఢిల్లీకి వచ్చాను.” అని సీఎం రేవంత్ తెలిపారు.
అందుకే ఢిల్లీకి వచ్చా
తెలంగాణలో ‘భారత్ సమ్మిట్ (Bharat Summit)’ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama)తో పాటు 60 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. భారత్ సమ్మిట్‌కు కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అందుకోసమే తాను ఢిల్లీకి వచ్చినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కలుస్తున్నట్లు వివరించారు.
తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు
తెలంగాణలో ‘మిస్ వరల్డ్ (Miss World in Telangana 2025)’ పోటీలు జరగనున్నాయి. కనీవినీ ఎరుగని విధంగా ఈ పోటీలను అత్యంత ఘనంగా నిర్వహిస్తాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కా ప్రణాళికతో ఈ పోటీలు నిర్వహించేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నాం. నెలరోజుల పాటు దీనికి సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి. ఇందుకోసం రెండు రోజుల్లో అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తాం. అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.






