
తెలంగాణలో రోజురోజుకు ఎండ తీవ్రత (Summer News) పెరుగుతోంది. ఫిబ్రవరి నెల చివరి వారంలోనే ఎండలు మండిపోయాయి. ఇక మార్చి నెల మొదలైన తర్వాత భానుడి భగభగలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి కాలం నేపథ్యంలో ఒంటిపూట బడులు (Half Day School) నిర్వహించాలని నిర్ణయించింది.
మార్చి 15 నుంచి ఒంటిపూట బడి
ఇందులో భాగంగా ఈనెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నట్లు వెల్లడించింది. ఒంటిపూట బడులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 (Half Day School Timings) వరకు పని చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. మరోవైపు పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు తరగతులు జరగనున్నట్లు వివరించింది.