మన Enadu: ఎలాంటి పత్రాలు లేకుండా అర్ధరాత్రి సమయంలో అనుమానాస్పదంగా భారీగా తరలిస్తున్న నగదును మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు.
విశ్వసనీయ సమాచారంతో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో గతరాత్రి ఇన్నోవా కారులో హవాలా డబ్బులు తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేయగా.. విక్రమ్ అనే వ్యక్తి తన ఇన్నోవా క్రిస్టా కారులో తరలిస్తున్న రూ. 50 లక్షల హవాలా డబ్బును మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా రూ. 50 లక్షల డబ్బులను మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ విషయంపై పోలీసులు ఆరా తీయగా.. ఇవన్నీ రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన డబ్బులని చెప్పినా అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకుని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. విక్రమ్ వద్ద దొరికిన రూ. 50 లక్షలను ఐటి డిపార్ట్మెంట్కి అప్పగించనున్నట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.







