Mana Enadu:పెన్షన్.. వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు ప్రభుత్వాలు కల్పించే ఓ హక్కు. అందుకు తగ్గట్లే ప్రభుత్వాలూ ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టే బడ్జెట్లో పెన్షన్ల కోసం భారీ మొత్తంలో కేటాయింపులు చేస్తుంటాయి. వీటిని ప్రతినెలా పంపిణీ చేసి పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తుంటాయి. తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మొదటి నెల ప్రతి లబ్ధిదారుడి ఖాతాలో రూ.7 వేలు బకాయిలతో కలిపి ఇంటింటికీ వెళ్లి అందజేసింది. అలాగే ఆగస్టు 1వ తేదీన ఒక్కరోజే దాదాపు 96శాతం పెన్షన్ మొత్తాన్ని అర్హులకు అందజేసింది. ఇదంతా బాగానే ఉన్నా.. తాజాగా కొందరు పెన్షన్దారులకు ప్రభుత్వం షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం.
అర్హులకే నిజమైన సంక్షేమ ఫలాలు
రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ దారులకు బిగ్ షాక్ ఇవ్వనుందా? అంటే అవుననే తెలుస్తోంది. త్వరలోనే దాదాపు 2 లక్షల మంది పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించబోతున్నట్లు సమాచారం. తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. త్వరలోనే వేలాది మంది పెన్షనర్లను తొలగిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బోగస్ పింఛన్లను కట్ చేసే కార్యక్రమం చేపడతామని ఆయన తెలిపారు. అర్హులకే నిజమైన సంక్షేమ ఫలాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఏపీలో మొత్తం 65లక్షల మందికిపై పింఛన్ లబ్దిదారులు ఉన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కొంతమంది బోగస్ పింఛన్లు తీసుకున్నట్లు ఏపీ సర్కార్ భావిస్తోంది.

త్వరలో క్షేత్రస్థాయి పరిశీలన
దీనిపై త్వరలోనే క్షేత్రస్థాయిలో పరిశీలన జరగనున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం వృద్ధులకు రూ. 4వేలు, దివ్యాంగులకు రూ. 6వేలు పూర్తిస్థాయిలో వైకల్యం ఉన్నవాళ్లకు రూ.15వేలు, కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి రూ. 10వేల చొప్పున పింఛన్లు అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వం తీసుకనున్న ఈ నిర్ణయంతో దాదాపు 2 నుంచి 3లక్షల మందికి పింఛన్లు కోల్పోయే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆయా బోగస్ అర్హుల గుండెల్లో రైళ్లు పరుగెత్తడం ఖాయం.
త్వరలో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం: పెమ్మసాని
మరోవైపు దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం అనుమతించింది సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గత ప్రభుత్వ తీరు వల్ల ఇళ్ల నిర్మాణంలో ఏపీ వెనుకబడిందని ఆయన విమర్శించారు. కేంద్ర నిధులను వినియోగించుకుంటే 5, 6 లక్షల ఇళ్లు పూర్తి అయ్యేవన్నారు. అలాగే నరేగా నిధుల వినియోగంలోనూ గత రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్ర నిధులను వినియోగించుకుని.. ఏపీలో జల్ జీవన్ మిషన్ పనులు పూర్తి చేసుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని సూచించారు.







