Mana Enadu: గోదారి గట్టుంది.. గట్టు మీద చెట్టుంది.. ఆ చెట్టుకు 150 ఏళ్ల చరిత్ర ఉంది. అన్నేళ్ల హిస్టరీ అంటే ఆ చెట్టుతో ఎంతో మందికి అనుబంధం ఉండే ఉంటుంది. ఎందుకు లేదు ఉంది. కేవలం అది సాధారణ వృక్షం కాదు. ఎంతో మందికి వర్షంలో గొడుగైంది.. ఎండలో నీడైంది. అలా వందల ఏళ్ల నుంచి ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని దీటుగా నిలబడింది. కానీ ప్రతి జీవి ఎక్స్పైరీ డేట్తోనే భూమ్మీదకు వస్తారనేది తెలిసిందే కదా. అలా ఆ చెట్టుకు కూడా నిండు నూరేళ్లు కాదు కానీ.. 150 ఏళ్ల నిండాయి. తాజాగా ఆ భారీ వృక్షం నేలకొరిగింది. చెట్టు నేలకొరిగితే ఇంత బిల్డప్ ఏంటి అనుకుంటున్నారా..? అది మామూలు చెట్టు కాదండోయ్ మరి. 150 ఏళ్ల చరిత్రే కాదు.. 300 సినిమాల్లో కనిపించిన హిస్టరీ కూడా ఈ వృక్షానికి ఉంది.
వందల సినిమాల్లో అద్భుత సన్నివేశాలకు వేదికగా నిలిచిన 150 ఏళ్ల నాటి భారీ వృక్షం నేలకొరిగింది.

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డున ప్రకృతి సోయగానికి చిరునామాగా నిద్రగన్నేరు చెట్టు ఒకటి ఉంటుంది. వందల ఏళ్ల నుంచి ఆ ప్రాంత ప్రజలకు నీడనిస్తూ.. పర్యాటక ప్రాంతంగా నిలిచిన ఆ వృక్షం సోమవారం రోజున పడిపోయింది. ఈ చెట్టు వద్ద సుమారు 300 తెలుగు సినిమాలు చిత్రీకరించారు. టాలీవుడ్ వెటరన్ డైరెక్టర్లు అయిన బాపు, కె.విశ్వనాథ్, కె.రాఘవేంద్రరావు వంటి వారు ఇక్కడ తమ సినిమాల్లోని పలు సన్నివేశాలు, పాటలను షూట్ చేశారు. అలా ఈ భారీ వృక్షం ఈ డైరెక్టర్ల ఫేవరెట్ షూటింగ్ స్పాట్ అయింది. అలా కాల క్రమేన ఈ చెట్టు సినిమా చెట్టు అనే పేరుతో ప్రసిద్ధి గాంచింది.
ఈ వృక్షం కిందే అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ, మోహన్‌బాబు వంటి అగ్రహీరోల అనేక సినిమాలను చిత్రీకరించారు. 1975లో వచ్చిన పాడి పంటలు మూవీతో ఈ వృక్షం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత శంకరాభరణం, త్రిశూలం, సీతారామయ్య గారి మనవరాలు వంటి సినిమాల్లో ఈ చెట్టు కీలక పాత్ర పోషిందని చెప్పొచ్చు. ముఖ్యంగా సీతారామయ్య గారి మనవరాలు చిత్రంలో ఈ చెట్టు వద్దే కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
అలా వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సినీ చెట్టు సంరక్షణ విషయంలో పాలకులు, అధికార యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ చూపించకపోవడం.. ఏటా వరదలకు గట్టు కొద్దికొద్దిగా దిగబడి చివరికి చెట్టు మొదలు రెండుగా చీలి పడిపోవడంతో సోమవారం రోజున ఈ భారీ వృక్షం నేలకొరిగింది. కూలింది చెట్టే కానీ దాంతో ఉన్న జ్ఞాపకాలు కావంటున్నారు ఈ ప్రాంత ప్రజలు. ఈ చెట్టు కింద తమకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని.. తాము బతికున్నంత వరకు అవి పదిలంగా తమ మదిలోనే ఉంటాయంటున్నారు.






