Mana Enadu: ఒక భాషలో సూపర్ సక్సెస్ అయిన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం కామన్. ఒకే సినిమాను నాలుగైదు భాషల్లో రీమేక్ చేసిన సంఘటనలున్నాయి. అయితే ఓ చిత్రాన్ని మాత్రం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 26 సార్లు రీమేక్ అయి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. ఇక ఇప్పుడు హిందీలోనూ రీమేక్ అయి త్వరలో రిలీజ్ కు రెడీ అయింది. ఇంతకీ హిందీలో రాబోతున్న సినిమా ఏంటి.. ఆ ఒరిజినల్ చిత్రం ఏంటో మీకు తెలుసా..
పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ సినిమా.. 2016లో విడుదలైన ఇటాలియన్ మూవీ. ఇప్పటికే 24 భాషల్లో దీన్ని రీమేక్ చేశారు. ఇన్ని భాషల్లో రీమేక్ అయిన ‘పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్’ మాత్రం ఇంగ్లీష్‌లో మాత్రం తెరకెక్కలేదు. అయితే 2017లో రీమేక్ చేయాలని ఓ కంపెనీ ఈ చిత్ర హక్కులను కొనుగోలు చేయగా.. ఆ తర్వాత ఆ కంపెనీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదర్కొవడం.. ఆ కంపెనీ సీఈవోపై క్రిమినల్ ఛార్జస్ నమోదు కావడంతో సినిమా పట్టాలెక్కలేదు.
ఇప్పటి వరకు ఈ సినిమా నథింగ్ టు హైడ్ (ఫ్రెంచ్), ఇంటిమేట్ స్ట్రేంజర్స్ (కొరియన్), కిల్ మొబైల్ (మాండరిన్) లౌడ్ కనెక్షన్ (రష్యన్), వైల్డ్ గేమ్ (ఐస్‌ల్యాండిక్) సహా వివిధ భాషల్లో రీమేక్ చేశారు. అరబిక్, రొమేనియన్, హిబ్రూ, జర్మన్ భాషల్లో రీమేక్ చేసి ‘పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్’ అనే టైటిల్ పెట్టారు. కన్నడలో ‘లౌడ్ స్పీకర్’ అనే పేరుతో వచ్చింది. ఇక మలయాళంలో ‘12th మ్యాన్’, తెలుగులో ‘రిచి గాడి పెళ్లి’ సినిమాలు ఈ సినిమా లైన్ నుంచి తీసుకుని రూపొందించారు.
ఇక 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమాను హిందీలో తెరకెక్కించారు. బాలీవుడ్ అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్, తాప్సి, అమ్మీ వ్రిక్, వాణీకపూర్, ఫర్దీన్‌ఖాన్, ఆదిత్య సీల్, ప్రజ్ఞా జైశ్వాల్‌లు ప్రధాన పాత్రల్లో ‘ఖేల్ ఖేల్ మే’ అనే పేరుతో తెరకెక్కింది. ముదస్సర్ అజీజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.