Mana Enadu:హాలీవుడ్లో ప్రపంచం మెచ్చిన సినిమాల్లో మార్వెల్, డీసీ చిత్రాలు కాకుండా అత్యంత ఆదరణ పొందిన సినిమాల్లో అవతార్ సిరీస్ ముందు స్థానంలో ఉంటుంది. డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ పండోర అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందాలను కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్స్ట్తో చూపించి అద్భుతం చేశారు. ఆ అద్భుతానికి యావత్ సినీ ప్రపంచం అబ్బురపడింది. అలా అవతార్, ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’తో మూవీ లవర్స్‌కు మంచి మ్యాజికల్ ట్రీట్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 భాషల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలు కలెక్షన్ల సునామీ సృష్టించాయి.
అయితే ఈ ఫ్రాంచైజీలో ఇప్పుడు మూడో భాగం కూడా వస్తోంది. ఇప్పటికే పార్ట్-3 పనులు కూడా షురూ అయ్యాయి. తాజాగా మేకర్స్ అవతార్-3 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. మూడో భాగం టైటిల్, కాన్సెప్ట్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది డిసెంబర్ 19వ తేదీన ‘అవతార్- ఫైర్ అండ్ యాష్’ సినిమా విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు.
మూడో భాగాన్ని పంచభూతాల్లో ఒకటైన అగ్నికి సంబంధించిన కాన్సెప్ట్‌తో రూపొందించనున్నట్లు చెప్పారు. మరోసారి పండోర గ్రహానికి వెళ్లేందుకు రెడీగా ఉండండి అంటూ మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇక ఈ ఫ్రాంచైజీలో రానున్న ‘అవతార్ 4’ 2029లో, చివరిగా రానున్న ‘అవతార్ 5’ డిసెంబరు 2031లో విడుదల చేయనున్నట్లు జేమ్స్ కామెరూన్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.






