ManaEnadu:ఛత్తీస్గఢ్ (Chhattigsarh) లో మరోసారి కాల్పుల మోత మోగింది. బస్తర్ ప్రాంతం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. దంతెవాడ – బీజాపుర్ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో భారీ ఎన్కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు ధ్రువీకరించారు.
నిఘా వర్గాల సమాచారం మేరకు దంతెవాడ, బీజాపూర్ జిల్లా ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలను చూసిన మావోయిస్టులు (Maoists) వారిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇవాళ (సెప్టెంబరు 3వ తేదీ) ఉదయం 10.30 గంటలకు ఎన్కౌంటర్ మొదలైంది.
భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఈ ఎన్కౌంటర్లో 9 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు చెప్పారు. అయితే ఘటనాస్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాల (Maoist Weapons)ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
కాగా.. ఆగస్టు 29వ తేదీనన నారాయణపుర్ జిల్లా (Narayanapur) అబూజ్మాడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు-మావోయిస్టు దళాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో ముగ్గురు మహిళా మావోయిస్టులు మరణించారు. తాజా ఘటనతో కలిపి ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ఎదురుకాల్పుల ఘటనల్లో 154 మంది మావోయిస్టులు హతమయ్యారని స్థానిక పోలీసులు వెల్లడించారు.
ఇక ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) మావోయిస్టులపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నక్సల్స్ అంతానికి బలమైన, పకడ్బందీ వ్యూహం అవసరమని అభిప్రాయపడ్డారు. 2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదం నుంచి దేశాన్ని విముక్తి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందని పేర్కొన్నారు.







