Mana Enadu: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi) తెలుగు వారికి సుపరిచతమే. తన మొదటి సినిమా యుగానికి ఒక్కడు నుంచి కార్తీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. తనకంటే ముందు టాలీవుడ్‌లో తన సినిమాలను డబ్ చేసి రిలీజ్ చేస్తున్న తన సోదరుడు, హీరో సూర్య (Suriya)కు తెలుగు రాకపోయినా కార్తీ మాత్రం మొదటి నుంచి తెలుగు నేర్చుకోవడంపై ఫోకస్ పెట్టాడు. చాలా వరకు తన సినిమాలకు తెలుగు డబ్బింగ్ కూడా కార్తీ చెబుతుంటాడు. అందుకే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే కార్తీ తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందాడు.
అలా తమిళంలో తాను చేసిన ప్రతి సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. కొన్ని సినిమాలను తమిళ ప్రేక్షకులు ఆదరించకపోయినా తెలుగు ఆడియెన్స్ మాత్రం తప్పకుండా ఆదరిస్తున్నారు. అలా టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న కార్తీ లేటెస్ట్‌గా మరో వర్సటైల్ కోలీవుడ్ నటుడు అరవింద స్వామి (Aravindha Swamy)తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాడు.
కార్తీ, అరవింద స్వామి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ లేటెస్ట్ మూవీ మెయ్యళగన్ (Meiyazhagan). తెలుగులో సత్యం సుందరం (Sathyam Sundaram)అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ’96’ వంటి క్లాసిక్ హిట్ అందించిన ప్రేమ్ కుమార్.సి (Prem Kumar C) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దసరా కానుకగా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా తెలుగు టీజర్‌ను రిలీజ్ చేశారు.
ఈ టీజర్ చూస్తుంటే.. ’96’ లాంటి లవ్ స్టోరీతో ఆకట్టుకున్న ప్రేమ్ కుమార్ ఈసారి ఫ్రెండ్‌షిప్ నేపథ్యంలో సినిమాను తీసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కార్తీ, అరవింద్ స్వామి ఫ్రెండ్స్‌గా నటిస్తున్నారు. టీజర్‌లో వీళ్లిద్దరు ఫ్రెండ్స్ అని మాత్రం తెలుస్తోంది కానీ స్టోరీని ఏ మాత్రం రివీల్ చేయకుండా డైరెక్టర్ జాగ్రత్త పడ్డారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య- జ్యోతిక(Suriya – Jyothika) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ్ కిరణ్, శ్రీదేవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 96 సినిమా సంగీత దర్శకుడు గోవింద్ వసంత (Govindha Vasantha) ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.