నేచురల్ స్టార్ నాని (Nani) వాల్ పోస్టర్ సినిమాస్ అనే బ్యానర్ స్థాపించి మంచి కథలను వెండితెరపైకి తీసుకువస్తున్నారు. తాజాగా ఆయన నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన సినిమాయే కోర్ట్ (Court Movie). కోర్ట్ రూమ్ డ్రామా కథతో రూపొందించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్ కు రెండ్రోజులు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్‌తో సందడి చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా..?
సినిమా : కోర్ట్
నటీనటులు: హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ, సాయికుమార్, హర్షవర్ధన్, రోహిణి
మ్యూజిక్ : విజయ్ బుల్గానిన్
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
సమర్పణ: నాని
రచన, దర్శకత్వం: రామ్ జగదీశ్
రిలీజ్ డేట్ : 14-03-2025
రేటింగ్ 3/5
స్టోరీ ఏంటి ?
2013 నేపథ్యంలో సాగే ఈ కథలో చంద్రశేఖర్ అలియాస్ చందు (రోషన్) ఇంటర్ ఫెయిల్ అయిన ఓ కుర్రాడు. పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తుంటాడు. అలా ఓ ఇంటి దగ్గర వాచ్‌మెన్‌గా పనిచేసే చందు… ఇంటర్ చదువుతున్న పెద్దింటి అమ్మాయి, జాబిలి (శ్రీదేవి)తో ప్రేమలో పడతాడు. ఆ విషయం తెలుసుకున్న జాబిలి బంధువు మంగపతి (శివాజీ) కోపంతో పోక్సో చట్టంతోపాటు, ఇతర కఠినమైన సెక్షన్ల కింద చందుపై కేసు పెడతాడు. ఆ తర్వాత చందు జీవితం ఎలాంటి మలుపు తిరిగింది..? ఫేమస్ లాయర్ మోహన్‌రావు (సాయికుమార్) దగ్గర పనిచేసే జూనియర్ లాయర్ సూర్యతేజ (ప్రియదర్శి) చందు కోసం చేసిన న్యాయ పోరాటం ఫలించిందా? అన్నది తెరపైనే చూడాలి.
మూవీ ఎలా ఉంది?
పోక్సో చట్టం, కొంతమంది దాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరు గురించి ఈ సినిమా చెబుతుంది. ఓ అందమైన టీనేజ్ లవ్ స్టోరీతో ముడిపడిన ఈ సినిమా ఫస్టాఫ్ అంతా లవ్ స్టోరీ చుట్టూనే తిరుగుతుంది. ఇంటర్వెల్ నుంచి అసలైన కోర్ట్ రూమ్ డ్రామా షురూ అవుతుంది. సెకండాఫ్ లో కిడ్నాప్, రేప్ తో ఈ కథ ముడిపడి ఉంటుంది. కథనంలో మలుపులు లేకపోయినా పోక్సో చట్టం అందులో లొసుగుల్ని ఎత్తి చూపించడం, ఎవరి కోసం చట్టాలు తీసుకువస్తున్నారో వాళ్లకు ఆయా చట్టాల పైన అవగాహన ఉందా? అంటూ ప్రశ్నించిన తీరు సెకండాఫ్ కు హైలైట్‌గా నిలుస్తుంది.
ఎవరెలా యాక్ట్ చేశారంటే?
హర్ష్ రోషన్, శ్రీదేవి లవర్స్ గా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. జూనియర్ లాయర్ సూర్యతేజ పాత్రలో ప్రియదర్శి తన నటనతో మెస్మరైజ్ చేశారు. ఇక మంగపతి పాత్రలో శివాజీ జీవించారు. విజయ్ బుల్గానిన్ సాంగ్స్, మ్యూజిక్ అదిరిపోయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. తొలి సినిమానే అయినా రామ్ జగదీష్ ఎంతో క్లారిటీగా తాను అనుకున్న సినిమాను తెరపైకి తీసుకువచ్చాడు.
+ ప్లస్ పాయింట్స్
+ స్టోరీ
+ లవ్ స్టోరీ
– మైనస్ పాయింట్స్
– ఊహకు తగ్గట్టు సాగే స్టోరీ, కథనాలు
– లాజిక్‌కి దూరంగా కొన్ని సీన్స్
కన్ క్లూజన్ : కోర్ట్… ప్రేమ కేసులో గెలుపెవరిది?






