
బెట్టింగ్ యాప్స్ మాఫియా (Betting Apps Mafia)పై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో ఈ యాప్స్ ప్రమోట్ చేస్తూ అమాయకుల ప్రాణాలు బలయ్యేలా చేస్తున్న సినీ ప్రముఖులపై కొరడా ఝుళిపిస్తోంది. ఇందులో భాగంగా ఈ యాప్స్ ప్రమోట్ చేస్తున్న పలువురు సెలబ్రిటీలకు పోలీసు శాఖ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. మరోవైపు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతోంది. అయితే పోలీసుల నోటీసులు అందుకున్న వారిలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా ఉన్నాడు.
విజయ్ వాటిని ప్రమోట్ చేయరు
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై విజయ్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఆయన బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేయలేదని స్పష్టం చేసింది. చట్ట ప్రకారం నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్‌ను మాత్రమే విజయ్ ప్రమోట్ చేశాడని చెప్పుకొచ్చింది. ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ (Skilled Base Games) అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా ఉన్నాడని తెలిపింది. విజయ్ తాను ప్రమోట్ చేసే కంపెనీ, ప్రాడక్ట్‌కు చట్టప్రకారం అనుమతి ఉందని నిర్ధారించుకున్నాకే వాటి కోసం పని చేస్తారని వెల్లడించింది.
అది స్కిల్ బేస్డ్ గేమ్
“అన్ని అనుమతులున్న ఏ 23 (A23) అనే సంస్థకు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేశారు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు సుప్రీంకోర్టు (Supreme Court) చెప్పింది. ఏ 23 అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గతేడాది ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్‌కు ఎలాంటి సంబంధం లేదు. అనధికారికంగా పని చేస్తున్న ఏ సంస్థకూ విజయ్ ప్రచారకర్తగా వ్యవహారించలేదు.” అని ఆయన పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.