Mana Enadu : తమిళనాడులో స్థిరపడ్డ తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూరి(Actress Kasturi)ని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమెను కోర్టులో హాజరు పరచగా.. ఈ కేసు విచారించిన ఎగ్మోర్ మెట్రోపాలిటన్ న్యాయస్థానం 12 రోజుల పాటు ఆమెకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆమెను పుళల్ కేంద్ర కారాగారానికి తరలించారు.
న్యాయాన్ని గెలిపించండి
ఈ సందర్భంగా తీర్పు అనంతరం కోర్టు నుంచి బయటకు వచ్చిన కస్తూరి మీడియాతో మాట్లాడారు. ‘‘అధికార దుర్వినియోగానికి ముగింపు పలకండి. న్యాయాన్ని గెలిపించండి’’ అని ఆమె కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. తెలుగు వారికి కస్తూరి పరిచయమైన ముఖమే. తెలుగు టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే ఓ ప్రముఖ సీరియల్ లో నటించి ఆమె తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచారు.
తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు
అయితే నవంబరు 3న చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తమిళనాడులోని తెలుగువారిపై కస్తూరి శంకర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలుగు మాట్లాడే వారు తమిళనాడులో అంతఃపురంలో పని చేసే వారంటూ తెలుగు వాళ్లను తక్కువ చేసి మాట్లాడారంటూ ఆమెపై తెలుగు ప్రజలు ఆగ్రహించారు. ఈ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగడంతోపాటు తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి.
కస్తూరి అరెస్టు
ఈ కేసుల్లో తనకు ముందస్తు బెయిలు ఇవ్వాలంటూ కస్తూరి మదురై కోర్టును ఆశ్రయించచినా.. న్యాయస్థానం పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో గత కొంతకాలంగా ఆమె అజ్ఞాతంలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఆమె కోసం పోలీసులు గాలింపు చేపట్టగా.. చివరకు హైదరాబాద్ శివారులో ఓ సినీ నిర్మాత ఇంట్లో ఆమె ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఆమెను కస్టడీలోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరిచారు.






