
వైస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ(vallabhaneni vamsi)కి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో బెయిల్ కోరుతూ వంశీ హైకోర్టులో(AP High Court) పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
వంశీ అరెస్టు
ఫిబ్రవరి 13వ తేదీన గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ (vallabhaneni vamsi arrest)ని విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీస్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేస్తున్న సత్యవర్ధన్‌ను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని వంశీపై ఫిర్యాదు నమోదవ్వగా.. కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద వంశీని అరెస్టు చేశారు.
కేసు దర్యాప్తు ముమ్మరం
ఈ కేసులో వంశీకి వ్యతిరేకంగా పోలీసులు బలమైన సాక్ష్యాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ రాయదుర్గంలో వంశీ నివసిస్తున్న గేటెడ్ కమ్యూనిటీ వద్ద సీసీ కెమెరాల్లో ఫుటేజీ సేకరించగా అందులో కీలక ఆధారాలు లభించాయి. మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా బెదిరించిన కేసులో బాధితుడు సత్యవర్ధన్ వాంగ్మూలాన్ని విజయవాడ రెండో జూనియర్ సివిల్ జడ్జి రికార్డ్ చేశారు.