Mana Enadu : వంట చేయడం బద్ధకమై కొందరు.. వండుకునేందుకు సమయం లేక ఇంకొందరు.. వంట చేయడం రాక మరికొందరు ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ (Online Food Order) చేయడం ఇప్పుడు బాగా అలవాటై అయిపోయింది. ఆర్డర్ చేసిన అరగంట లోపే మీకు నచ్చిన ఫుడ్ మీ ఇంటి ముందుకు వచ్చేస్తుంది. అలాంటి ఆన్ లైన్ డెలివరీ ఫుడ్ కంపెనీల్లో మొదటి స్థానంలో ఉన్న స్విగ్గీ గురించి తెలియని వారుండరు. అయితే తాజాగా స్విగ్గీ (Swiggy)కి ఏపీ షాక్ ఇచ్చింది.
స్విగ్గీ తీరుతో మాకు నష్టాలు
ఏపీలో ఈనెల 14వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్విగ్గీ (Swiggy Boycott) ఆన్‌లైన్ ఆహార సరఫరా ఆర్డర్లను బహిష్కరిస్తున్నట్లు హోటల్ యజమానుల సంఘం ప్రకటించింది. ఈ మేరకు విజయవాడలో ఏపీ హోటల్ అసోసియేషన్ (AP Hotel Association) అత్యవసర సమావేశం నిర్వహించి.. ఇప్పటికే మూడు దఫాలుగా స్విగ్గీ, జుమాటో ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్, డెలివరీ సంస్థలతో చర్చించామని తెలిపారు. తమకు ఇవ్వాల్సిన కమిషన్ విషయంలో ఈ సంస్థలు అనేక నిబంధనలు విధిస్తున్నారని అన్నారు. అందువల్ల హోటళ్లు, రెస్టారెంట్ల (Restaurants)కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని విమర్శించారు.
ట్యాక్స్ భారం మాపైనే
‘మాకు తెలియకుండానే కాంబో ప్యాకేజీల పేరిట ఆర్డర్లు బుక్ చేస్తున్నారు. వాటి అయ్యే ఖర్చులు, పన్నులను సైతం మాపైనే వేస్తున్నారు. జొమాటో సంస్థ (Zomato) కొంత వరకు మా అభ్యంతరాల పరిష్కారానికి ఆససక్తి చూపింది. కానీ స్విగ్గీ సంస్థ వాయిదా వేస్తూ కాలయాపన చేయడం వల్ల అనివార్య పరిస్థితుల్లో బాయ్‌కాట్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.’ అని అసోయేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.వి.స్వామి తెలిపారు.
14 నుంచి స్విగ్గీ బంద్
‘ఇక క్యాష్ పేమెంట్స్ చేయకుండా స్విగ్గీ సంస్థ ఇబ్బందిపెడుతోంది. ఆన్‌లైన్ ఆహార సరఫరా సంస్థలతో వ్యాపారం కొనసాగించేందుకు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వారు అనుసరిస్తున్న నియమ నిబంధనల్లో తగిన మార్పులు చేసేందుకు సమ్మతిస్తే అప్పుడు మా నిర్ణయాన్ని పునరాలోచన చేస్తాం. ఈనెల 14 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని రెస్టారెంట్లు, హోటళ్లలో స్విగ్గీ ఆర్డర్లు తీసుకోబోం.’ అని ఏపీ వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు ప్రకటించారు.






