ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుపై కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా సినీరాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. అక్రమ అరెస్టును అంతా ఖండిస్తుండగా.. అదే కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీనిపై తెదేపా శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఇటీవలె ఇదే విషయంపై కుటుంబసభ్యులు లేకున్నా మాకు తెదేపా కుటుంబం ఎప్పుడూ వెంటే ఉంటుందని నారా బ్రాహ్మణి సైతం పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఓవైపు నందమూరి, నారా కుటుంబాలు రాజమండ్రిలో ఉంటే జూనియర్ మాత్రం కనీస స్పందన లేకుండా సైమా అవార్డుల కోసం దుబాయ్ పయనం కావడం మరింత వివాదాస్పదమైంది. అయిదే ఇదే అదనుగా వైసీపీ శ్రేణులు ఎన్టీఆర్ ఇక తెదేపా పగ్గాలు చేపడతారంటూ, ఇరు కుటుంబాల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. జూనియర్ ఎన్టీఆర్ సోమవారం ఓ ట్వీట్ చేశారు. సెప్టెంబరు 2 తర్వాత ఇదే తొలిట్వీట్ కావడంతో అంతా ఉత్సుకతతో ట్విట్టర్ తెరిచి చూస్తే వినాయక చవితి శుభాకాంక్షల సందేశం అందులో ఉండటంతో చల్లబడుతున్నారు. ఈ ట్వీట్‌లో అందరికీ శుభ సంతోషాలు కలగాలని జూనియర్ రాయడంపై బాబు అభిమానులు మండిపడుతున్నారు. చంద్రబాబుకు మినహాయింపు అంటూ కూడా రాయాల్సిందంటూ కామెంట్లు పెడుతున్నారు. భవిష్యత్తులో సమయం వచ్చినప్పుడు వాడేందుకు ఈ ట్వీట్‌ను చాలామంది స్క్రీన్‌షాట్‌లు తీస్తూ, బుక్‌మార్కులకు జత చేస్తున్నారు.