
అయోధ్య రామమందిరం (Ayodhya Ram Mandir) ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ (Satyendra Das) తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఇటీవల ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన లఖ్‌నవూలోని ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
బ్రెయిన్ స్టోక్ తో పరిస్థితి విషమం
సత్యేంద్ర దాస్ మధుమేహం, బీపీ (Blood Pressure)తో బాధపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో పరిస్థితి విషమించిందని వైద్యులు చెప్పినట్లు తెలిపారు. వారం రోజులుగా ఆయన మృత్యువుతో పోరాడుతూ బుధవారం ఉదయం ప్రాణాలు కోల్పోయారని వైద్యులు ధ్రువీకరించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
1992 నుంచి రామమందిరానికి పూజారి
1992 డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదు కూల్చివేసిన (babri mosque demolition ) సమయంలోనూ సత్యేంద్రదాస్ తాత్కాలిక రామమందిరానికి పూజారిగా విధులు నిర్వర్తించారు. కూల్చివేతకు ముందు విగ్రహాలను సమీపంలోని ఫకీరే మందిరానికి తరలించారు. అలా రామజన్మభూమిలోని తాత్కాలిక ఆలయంలోఆ విగ్రహాలను ఉంచి వాటికి నిత్యం పూజలందించారు.
20 ఏళ్ల వయసులో దీక్ష
20 ఏళ్ల వయసులో నిర్వాణి అఖాడాలో చేరి ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్న సత్యేంద్రదాస్.. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం (Ayodhya Ram Mandir Inauguration), బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో ముఖ్య పాత్ర పోషించారు. ప్రస్తుతం రామాలయ ప్రధాన పూజారిగా కొనసాగుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు.