Mana Enadu : టాలీవుడ్ కు తెలంగాణ సర్కార్ (Telangana Govt) వీలైనంత సాయం చేస్తూనే వస్తోంది. ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు.. ఇలా చాలా విషయాల్లో అనుమతులు ఇస్తూ వచ్చింది. అలాంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోల (Benefit Shows Ban)కు అనుమతులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. అయితే దీనికి కారణం అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్ (Pushpa 2)’ మూవీ ప్రీమియర్ షోలో హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద రేవతి అనే మహిళ మరణించడమే.
బెన్ ఫిట్ షోలకు బ్రేక్
సంధ్య థియేటర్ కు బుధవారం రాత్రి అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా చూసేందుకు వచ్చాడు. ఈ క్రమంలో ఆయణ్ను చూసేందుకు జనం ఎగబడటంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి (Pushpa 2 Fan Death) చెందగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఇప్పుడు ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచి రాష్ట్రంలో బెన్ ఫిట్ షోలకు అనుమతించమని ప్రకటించింది.
బాధితులకు పరిహారం ఇవ్వాలి
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy) మాట్లాడుతూ.. సంధ్య థియేటర్ వద్ద జరిగిన విషాద ఘటన చాలా బాధాకరమని అన్నారు. రేవతి మృతిపట్ల సంతాపం ప్రకటించిన ఆయన.. అలాంటి రద్దీ సమయంలో హీరోలు అక్కడికి వెళ్లడం కరెక్టేనా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై హీరో (Allu Arjun), మేకర్స్ స్పందించకపోవడం బాధాకరమని కోమటిరెడ్డి అన్నారు. వేల కోట్ల కలెక్షన్లు వచ్చాయని చెప్పుకుంటున్న మేకర్స్.. బాధితులకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
సంక్రాంతి సినిమాలకు పెద్ద షాక్
అయితే రాష్ట్రంలో ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమన్న ప్రభుత్వ ప్రకటన రానున్న సంక్రాంతి సీజన్ (Sankranti Movies) పై తీవ్రంగా పడే అవకాశం ఉందని నిర్మాతలు అంటున్నారు. జనవరిలో సంక్రాంతి పండక్కి బడా బడా సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్ (Game Changer)’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బడా హీరోల చిత్రాలు ఈ రేసులో ఉన్నాయి. ఈ క్రమంలో బెన్ ఫిట్ షోలు రద్దు చేయడం అంటే ఈ సినిమాల రెవెన్యూ కాస్త గండం వచ్చినట్టేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.






