Mana Enadu : బాలీవుడ్ స్టార్ యాక్టర్ గోవిందా (Govinda)కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదవశాత్తూ ఇంట్లో గన్ మిస్‌ఫైర్ కావడంతో ఆయన కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆయన కాలుకు తీవ్ర గాయం కావడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అభిమానులెవరూ ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఇవాళ (మంగళవారం) ఉదయం ఆయన ఇంటి నుంచి కోల్‌కతా (Kolkata)కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు గోవిందా మేనేజర్ తెలిపారు. లైసెన్స్‌డ్ రివాల్వర్‌ను తీసుకెళ్తుండగా అది చేయి నుంచి జారి కింద పడిందని వెల్లడించారు. దీంతో తుపాకీ పేలి కాలిలోకి బుల్లెట్ (Gun Miss Fire) దూసుకెళ్లిందని.. వెంటనే వైద్యులు చికిత్స అందించి బుల్లెట్‌ను తొలగించారని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉంటారని పేర్కొన్నారు.
గోవిందా (Govinda Gun Shot)కు బుల్లెట్ గాయమైందని తెలుసుకున్న ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. పలువురు అభిమానులు ఆయణ్ను చూసేందుకు ఆస్పత్రి వద్దకు చేరారు. మరోవైపు సోషల్ మీడియాలో ‘గెట్ వెల్ గోవిందా’, ‘గెట్ వెల్ సూన్ రాజాబాబు’ అంటూ పోస్టులు పెడుతున్నారు.
1963లో పుట్టిన గోవిందా ప్రముఖ సీరియల్ ‘మహాభారత్ (Maha Bharat)’లో అభిమన్యు పాత్ర కోసం మొదటిసారి ఆడిషన్ ఇచ్చి.. ఆ తర్వాత ఖుష్బూ సరసన ‘తాన్ బదన్’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అది కాస్త సూపర్ హిట్ కావడంతో వరుస అవకాశాలతో బాలీవుడ్ (Bollywood) లో సత్తా చాటారు. గోవిందా నటనకే కాకుండా ఆయన డ్యాన్సుకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. డ్యాన్స్ చేసేటప్పుడు ఆయన హావభావాలు, స్వాగ్ ఆయణ్ను మిగతా నటుల కంటే భిన్నంగా ప్రేక్షకుల మదిలో నిలిపాయి.