Mana Enadu : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చేరారు. వైద్యపరీక్షల కోసం ఆమె చేరినట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. దిల్లీ మద్యం కేసు (Delhi Liquor Case)లో అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్నప్పుడు కవితకు గైనిక్ సమస్యలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆమె దిల్లీ ఎయిమ్స్ లో చికిత్స తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి నేడు ఆమె ఆస్పత్రిలో చేరారు. సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తి కానున్నట్లు సమాచారం.
కవిత మెడలో రుద్రాక్ష మాల
అయితే ఆమె ఆస్పత్రికి వెళ్లేటప్పుడు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తిహాడ్ జైలు (Tihar Prison) నుంచి విడుదలై హైదరాబాద్ కు వచ్చిన సమయంలోనూ కవిత వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ వీడియోల్లో ఆమె చాలా సన్నబడినట్లు కనిపించింది. తాజా వీడియోల్లోనూ ఆమె సన్నబడినట్లే కనిపిస్తోంది. మరోవైపు ఈ రెండు వీడియోల్లోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మాత్రం కవిత మెడలోని రుద్రాక్ష మాల (Rudraksha Mala). తిహాడ్ జైలు నుంచి విడుదలైన సమయంలోనూ ఆమె మెడలో ఇదే రుద్రాక్ష మాల కనిపించిన విషయం తెలిసిందే.
ఆధ్యాత్మిక మార్గంలో కవిత
అయితే ఈ జపమాలను చూసిన కొంతమంది ఆమె ఏదో దీక్షలో ఉందని అంటున్నారు. సహజంగానే కవిత(MLC Kavitha)కు దైవభక్తి ఎక్కువ అన్న విషయం చాలా సందర్భాల్లో చూసిందే. అయితే జైలు జీవితం గడిపిన సమయంలో ఆమె ఆధ్యాత్మిక మార్గంలోనే తన సమయాన్ని గడిపినట్లు తెలిసింది. అందుకు నిదర్శనంగానే ఆమె మెడలో జపమాల ధరించినట్లు సమాచారం. కష్టాల నుంచి బయటపడేందుకు దైవ మార్గాన్ని ఎంచుకుంటున్నానని.. గతంలో ఆమె మీడియాకు చెప్పారు. బహుశా ఆ ఉద్దేశంతోనే కవిత.. రుద్రాక్షమాలను ధరించి ఉంటారన్న చర్చ సాగుతోంది.