Mana Enadu : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) రూటే సపరేటు. విన్నపాలు, విజ్ఞప్తులు ఆయన డిక్షనరీలోనే లేవు. మాట విన్నారా ఓకే.. లేదా తల తెగి కింద పడాల్సిందే. ఈ డిక్టేటర్ తీరు ప్రపంచానికి తెలిసిందే. ఆయన పాలన గురించీ తెలిసిందే. అయితే దౌత్యం విషయంలో ఇన్నాళ్లూ కొన్ని నియమనిబంధనలు పాటించిన కిమ్.. ఇప్పుడు రూట్ మార్చారు. ఇక నుంచి వ్యక్తిగత దౌత్యాలు చేయకూడదని నిర్ణయించారు.
అమెరికాలో ఎవరు అధికారంలోకి వచ్చినా అమెరికా ప్రభుత్వం (USA Govt)తోనే డీల్ చేస్తామని ఉత్తర కొరియా దూత సాంగ్ కిమ్ న్యూయార్క్‌లోని ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టం చేశారు. ఏ కార్యవర్గం అధికారంలోకి వచ్చినా DPRKతో వ్యవహారాలు జరపాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ట్రంప్ (Donald Trump) సహా అమెరికాలో ఎవరు అధికారంలోకి వచ్చినా.. వ్యక్తిగత స్థాయిలో చర్చలు ఉండవని.. కిమ్ సర్కారు పాలసీ మార్చుకొన్నట్లు పేర్కొన్నారు. ఇది అమెరికాకు ఆలోచించిన దానికి పూర్తి భిన్నంగా ఉంటుందని వెల్లడించారు.
ఇక గతంలో ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో ఉత్తర కొరియా (North Korea) విషయంలో పట్టువిడుపులతో వ్యవహరించిన విషయం తెలిసిందే. కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉన్నా.. మరికొన్నిసార్లు చూసీచూడనట్లుగా వ్యవహరించారు. 2019లో వియత్నాంలో ట్రంప్-కిమ్‌జోంగ్ ఉన్ (Trump Kim Meeting) భేటీ జరిగినా అణ్వాయుధాలు వదిలేసే విషయంలో కిమ్ వెనక్కి తగ్గకపోవడంతో.. చర్చలు విఫలమయ్యాయి. బైడెన్ (Joe Biden) అధికారంలోకి వచ్చాక అమెరికాతో నార్త్ కొరియాకు దూరం పెరిగింది.