
తెలంగాణ(Telangana)లో మంత్రివర్గ విస్తరణ(Cabinet expansion)కు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి CM రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ మేరకు ఉగాది తర్వాత కొత్త మంత్రుల ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈమేరకు ఏప్రిల్ 3న క్యాబినెట్ కూర్పు జరగనున్నట్టు సమాచారం. ఇక క్యాబినెట్ విస్తరణతో పాటు అదే రోజు మంత్రుల శాఖల్లో మార్పులు కూడా జరగనున్నాయని, ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సమాచారం అందినట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి.
శాఖల్లో మార్పులు ఉంటాయా?
ఇక క్యాబినెట్ విస్తరణ అంశం తెరమీదరకు రావడంతో ఎవరెవరికి మంత్రి పదవులు వచ్చే అవకాశాలున్నాయి? ఎవరి శాఖల్లో మార్పులు జరగొచ్చు? ప్రస్తుత మంత్రుల్లో ఎవరినైనా తప్పిస్తారా? అనే అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్(Congress) నేతల్లో విస్తృత చర్చ జరిగింది. అటు కాంగ్రెస్ శ్రేణులు, ఇటు రాజకీయ వర్గాలతో పాటు శాసనసభ బడ్జెట్ సమావేశాల(Assembly budget sessions)కు హాజరైన మంత్రులు, MLAలు కూడా చర్చోపచర్చలు సాగించారు. పైగా ఢిల్లీ వేదికగా జరిగిన చర్చల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలువురు ఆశావహ MLAలతో పాటు మంత్రులతో చర్చలు జరిపారు.
క్యాబినెట్‌లోకి కొత్తగా ఎంతమంది?
మరోవైపు రాజగోపాల్‌రెడ్డి(Rajagopal Reddy), వివేక్, శ్రీహరిలకు బెర్తులు ఖాయమయ్యాయన్న వార్తల నేపథ్యంలో అసెంబ్లీలో ఈ ముగ్గురికి అభినందనలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా క్యాబినెట్‌లోకి కొత్తగా 4 లేదా 5ని తీసుకుంటారనే చర్చతో పాటు ప్రస్తుత మంత్రుల్లో ఒకరిద్దరికి ఉద్వాసన పలకవచ్చనే చర్చ కూడా జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఓ మహిళా మంత్రితో పాటు దక్షిణ తెలంగాణకు చెందిన మరో మంత్రి పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తంగా క్యాబినెట్ విస్తరణ అంశంతో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి.