కేంద్ర ప్రభుత్వం (central govt) రాబోయే ఖరీప్ సీజన్ కు సంబంధించి 14 పంటలకు మద్దతు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2025-26 ఖరీప్ సీజన్ కు సంబంధించి కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వరి క్వింటాలుపై రూ. 69 పెంచుతూ ఎమ్మాస్పీ ధర రూ. 2369 చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగానే మిగతా పంటలకు కూడా మద్దతు ధరలు పెంచుతున్నట్లు పేర్కొంది.
ఖరీప్ మార్కెటింగ్ సీజన్ నుంచి అమలు
ఖరీప్ మార్కెటింగ్ సీజన్ లో కేంద్ర క్యాబినెట్ పెంచిన ధరలు (msp) అమలులోకి వస్తాయని తెలిపింది. దీని కోసం కేంద్రం ప్రభుత్వం రూ. 2.7 లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపింది. రైతులకు వడ్డీ రాయితీ కింద రూ. 15, 642 కోట్లు అందించనున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులకు కాస్త ఊరట లభించనుంది.
ఏ పంటకు ఎంత పెంచారంటే..
వరి సాధారణ, గ్రేడ్- ఏకి రూ.69 పెంచగా.. మొక్కజొన్న (corn) రూ.175, పెసర రూ.86, కందిపప్పు రూ.450, వేరుశెనగ రూ.480, పొద్దుతిరుగుడు రూ.441, మినుములు రూ.400, సజ్జలు రూ.150, జొన్నలు రూ. 328, రాగులు రూ.596, సోయాబీన్ (soya been) రూ.436, కుసుమలు రూ.579, పత్తి రూ.589 ఒలిసెలు రూ.820, చొప్పున కనీస మద్దతు ధరను పెంచారు.






