
వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Director Ram Gopal Varma)కు ఏపీ సీఐడీ(AP CID) అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. 2019లో ఆయన తీసిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ మూవీపై అనకాపల్లి, మంగళగిరి, ఒంగోలులో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఇవాళ (మార్చి 5) CID అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే, ఈ కేసులో ఇంతకుముందు జారీ అయిన నోటీసుల(Notice)పై ఆయన తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానంలో విచారణ దశలో ఉండగానే RGVకి మళ్లీ నోటీసులు అందాయి.
గతేడాది నవంబర్ 29న కేసు నమోదు
ఇక ఈ కేసుకు సంబంధించి వర్మకు గుంటూరు(Guntur) సీఐడీ అధికారులు గత నెల 10న నోటీసులు జారీ చేశారు. కానీ, ఆయన విచారణకు హాజరుకాకుండా తన తరఫు లాయర్‌ను CID ఆఫీస్‌కు పంపించారు. సినిమా పనులతో బిజీగా ఉన్నందున విచారణకు రాలేనని, తనకు 8 రోజుల గడువు కావాలని కోరారు. ఆ గడువు పూర్తి కాకముందే వర్మకు నోటీసులు ఇవ్వడం గమనార్హం. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించలేదన్న ఫిర్యాదుతో ఆయనపై గతేడాది నవంబర్ 29న కేసు నమోదయింది.