మన ఈనాడు:
తెలంగాణ ప్రజలంతా ఒక్కటై పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం పందికొక్కుల్లా దోచుకు తిన్నారని టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ హయాంలో సింగరేణి దివాళా తీసే పరిస్థితి నెలకొందని రేవంత్ రెడ్డి (REVENTH REDDY) ఆరోపించారు.
అటు ప్రభుత్వంలో ఇటు కార్మిక సంఘాల్లో ఉండే కేసీఆర్ కుటుంబం కార్మికుల సమస్యలను మాత్రం గాలికొదిలేసిందన్నారు. తెలంగాణలో 15 అసెంబ్లీ నియోజక వర్గాల్లో సింగరేణి కార్మికులు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు. విజయభేరి బస్సు యాత్రలో భాగంగా గురువారం పార్టీ నేతలు మధుయాస్కీ, పొంగులేటి, శ్రీధర్ బాబు, ఇతర నాయకులతో కలిసి భూపాలపల్లిలోని
1 ఇంక్లైన్ గేట్ వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్‌లో సింగరేణి కార్మికులతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.
తెలంగాణ గాంధీనని చెప్పుకుంటున్న మనిషి, పార్లమెంటులో వీరోచితంగా పోరాడతానంటూ మహబూబ్‌నగర్ ప్రజల్ని మోసం చేసి నిద్రపోతున్నపుడు నడుం బిగించింది సింగరేణి కార్మికులని రేవంత్ గుర్తు చేశారు. ఆనాడు రాజకీయ పార్టీలు తెలంగాణ సాధనలో విఫలమైనపుడు జానారెడ్డి ఇంట్లో తెలంగాణ సాధనకు అవసరమైన కార్యాచరణ కోసం కేసీఆర్ శరణు కోరితే.. కోదండరాం అధ్యక్షతన జేఏసీ ఏర్పడిందని గుర్తు చేశారు.
జేఏసీ ఏర్పాటుతో ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఆర్‌ఎస్‌యూ వరకు, సీపీఐ నుంచి బీజేపీ వరకు అన్ని వర్గాల ప్రజలు ఏకమై తెలంగాణ నినాదాన్ని కేంద్రానికి వినిపించారన్నారు. సకల జనుల సమ్మెలో బొగ్గు ఉత్పత్తి ఆపేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు నిలిచిన సింగరేణి త్యాగాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయిందన్నారు. సకల జనుల సమ్మెలో పాల్గొనకుండా, బొగ్గు ఉత్పత్తి ఆపకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని కళ్లారా చూడలేకపోయే వారమన్నారు రేవంత్ రెడ్డి.
కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కార్మికులు గొంతెమ్మ కోర్కెలు ఏమీ కోరడం లేదని, హక్కులు మాత్రమే అడుగుతున్నారని, అసాధ్యమైనవి ఏమీ అడగడం లేదని, సింగరేణి నష్టాలకు జెన్‌కో చెల్లింపులు చేయకపోవడమే కారణమని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
సింగరేణి సీఎండీగా ఒకే ఒక్క అధికారిని ఎనిమిదేళ్లుగా కొనసాగిస్తూ నష్టాలకు కారణం అయ్యారన్నారని రేవంత్ రెడ్డి. మోదీ గనులను ప్రైవేటీకరించినపుడు కవిత ఎంపీగా ఆ బిల్లును మద్దతిచ్చారన్నారు. అరబిందో ఫార్మా కంపెనీలకు బొగ్గు కేటాయింపులు ఇచ్చారని, తాడిచర్లలో కేసీఆర్ కుటుంబానికి వాటాలు ఉన్నాయని రేవంత్ ఆరోపించారు.