
తెలంగాణలో ఉపఎన్నికల (Telangana By Elections)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో బై ఎలక్షన్స్ ఎందుకు వస్తాయని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పార్టీలు మారినప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎలా వస్తాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)ను నిలదీశారు. తెలుగుదేశంలో ఉన్న తలసానిని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని మంత్రిని చేయలేదా ? అని అడిగారు. అప్పుడు ఆ కోర్టు, ఇప్పుడు అదే స్పీకర్ కాదా..? అని రేవంత్ కేసీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.
మీరేం చేశారు?
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌లో పట్టభద్రులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ (CM Revanth Nizamabad Visit) పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR), ఆ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రం కోసం పోరాడిన పట్టభద్రుల కోసం కేసీఆర్ ఏం చేశారు..? పదేళ్లపాటు ఏమీ చేయని వారు.. ఇవాళ మమ్మల్ని తప్పుపడుతున్నారు. పదేళ్లపాటు నోటిఫికేషన్లు ఇవ్వలేదు. కాంగ్రెస్ సర్కార్ ఏడాదిలోనే 55,163 మందికి ఉద్యోగాలు ఇచ్చింది.’ అని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఎవరూ చేయని సాహసం చేశాం
26.50లక్షల మంది రైతులకు రూ.2లక్షల చొప్పున రుణమాఫీ చేశామన్న సీఎం రేవంత్.. సన్న వడ్లకు రూ.500 బోనస్ వచ్చి ఉంటే కాంగ్రెస్‌కు ఓటు వేయండని ఓటర్లను కోరారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను కేసీఆర్ రూ.7లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేశారని ఆరోపించారు. దేశంలో ఎవరూ చేయని సాహసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందని.. రాహుల్‌గాంధీ ఆశయం మేరకు రాష్ట్రంలో కులగణన సర్వే (Caste Census) పూర్తి చేశామని వెల్లడించారు.