తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం(MLC Election Campaign) నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఒక్కరోజే మూడు జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా నిజామాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 25న ప్రచారం ముగియనుండగా ఈరోజే ఆయా జిల్లాల్లో CM ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా MLC ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్(CM Schedule) ఖరారైంది.
ముందుగా నిజామాబాద్‌లో ఎన్నికల ప్రచారం
ముందుగా ఉదయం 11 గంటలకు రేవంత్ హైదరాబాద్(HYD) నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి నిజామాబాద్‌కు 11:45 నిమిషాలకు చేరుకుంటారు. ఆయన ఉ.11:50 నుంచి మ.1:30 వరకు నిజామాబాద్ పట్టణంలో నిర్వహించే పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు. మ.1:35కి అక్కడి నుంచి బయల్దేరి మంచిర్యాల జిల్లాకు మ.2:15కు చేరుకొని అక్కడ నిర్వహించే పట్టభద్రుల ఆత్మియ సమ్మేళనంలో పాల్గొంటారు.
చివరగా కరీంనగర్ జిల్లాలో..
చివరగా కరీంనగర్(Karimnagar) జిల్లాలో SRR కళాశాల మైదానంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు కరీంనగర్‌లో పట్టభద్రుల ఓట్లు అభ్యర్థిస్తారు. ప్రజాపాలన వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలను వివరించి, పట్టభద్రులు ఆలోచించి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని సీఎం కోరనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యేలా చేస్తున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. కాగా, ఈ పర్యటనలో సీఎంతో పాటు TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పలువరు మంత్రులు, ఆయా జిల్లాల MLAలు కూడా హాజరు కానున్నారు.






