Mana Enadu : తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త. దీపావళి కానుకగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీఏ(DA For Employees)పై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈరోజు (అక్టోబర్ 25వ తేదీ) సాయంత్రం వరకు డీఏపై నిర్ణయం ప్రకటించనున్నారు. జీవో 317పై మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికపై ఇవాళ ఉద్యోగ సంఘాలతో సీఎస్ శాంతి కుమారి(CS Shanti Kumari) చర్చించనున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 26వ తేదీన కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది.
మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ సర్కార్
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు కానున్న మంత్రివర్గ ఉపసంఘం దీపావళి(Diwali) తర్వాత శాఖల వారీగా సమావేశమై చర్చించనుంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని పునరుద్ఘాటించారు. డిమాండ్ల సాధన కోసం ఉద్యోగుల జేఏసీ నవంబరు 2 నుంచి కార్యచరణ ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్ బంజారహిల్స్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో గురువారం రోజున సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమావేశమయ్యారు.
ఉద్యోగుల డిమాండ్లు ఇవే
ఈ సందర్భంగా రెండేళ్ల నుంచి పెండింగులో ఉన్న ఐదు డీఏలు విడుదల చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు సీఎంను కోరారు. పెండింగులో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ-కుబేర్ వ్యవస్థను రద్దు చేయాలని.. పీఆర్సీ(PRC In Telangana) అమలు చేయాలని.. ఉద్యోగులు, పెన్షనర్ల సమాన వాటాతో ఈహెచ్ఎస్ అమలు చేయాలని విన్నవించారు. అంతే కాకుండా సీపీఎస్, యూపీఎస్ వద్దని.. పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని.. జీవో 317 బాధితులు కోరుకున్న చోటకు బదిలీ చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.
ఉద్యోగుల కోసం కేబినెట్ సబ్ కమిటీ
వారి అభ్యర్థను విన్న సీఎం రేవంత్ ఉద్యోగులతో కలిసి ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ(Cabinet Sub Committee) ఏర్పాటు చేస్తున్నానన్న ఆయన.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా.. కే.కేశవరావు ప్రత్యేక ఆహ్వానితుడిగా కేబినెట్ సబ్ కమిటీ ఉంటుందని తెలిపారు. దీపావళి తర్వాత శాఖల వారీగా ఉద్యోగులతో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమవుతుందని చెప్పారు. ఈ కమిటీ వారి సమస్యల పరిష్కారానికి సిఫార్సు చేస్తుందని తెలిపారు.