మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ మంత్రి విజయ్ షా(Minister Vijay shah).. ఇండియన్ ఆర్మీ కల్నల్ సోఫియా (Colonel Sofia)పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor) తర్వాత జరిగిన మీడియా సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషి పాల్గొనగా.. ఆమెను ఉద్దేశించి మంత్రి దిగజారుడు వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. భారతీయ సైనిక దళానికి చెందిన మహిళా అధికారిని కించపరిచేలా మంత్రి మాట్లాడటం సరికాదని, ఆయన రాజీనామాకు పట్టుబట్టాయి. పలువురు రాజకీయ నాయకులు, మాజీ సైనికాధికారులు సైతం మంత్రి వ్యాఖ్యలను ఖండించారు.
హైకోర్టు సీరియస్..
మంత్రి వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ హైకోర్టు (High court) సుమోటోగా కేసు స్వీకరించి ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయాలని ఆదేశించింది. దీనిపై స్పందించిన మంత్రి తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను ఎవరినీ కించపరచలేదని వివరణ ఇచ్చారు. అంతేకాకుండా తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు.
మంత్రి క్షమాపణ సరిపోదు : సుప్రీంకోర్టు
అయితే, ఈ వివాదంపై సుప్రీంకోర్టు(Supreme court) సైతం సీరియస్‌గా స్పందించింది. మంత్రి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, ఆయన క్షమాపణ సరిపోదని అభిప్రాయపడింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ సిట్‌లో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉండాలని, అందులో ఒక మహిళా అధికారి కూడా ఉండాలని సూచించింది. ఈ కేసును మే 28లోగా నివేదిక సమర్పించాలని కూడా ఆదేశించింది.
ఉగ్రవాదులకు సోదరి
ఈ క్రమంలోనే విజయ్ షాను ఇంకా ఎందుకు పదవి నుంచి తొలగించడం లేదని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. మంత్రిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో ఏర్పాటైన సిట్ మే 28న నివేదిక (Report) ఇవ్వనుంది. దాని ఆధారంగా చర్యలు ఉండొచ్చని.. ఈ క్రమంలోనే విజయ్ షా మంత్రి పదవిని కోల్పోయే చాన్స్ ఉందని భాజపా వర్గాలు కూడా వెల్లడించాయి. కాగా, కల్నల్ సోఫియాను ‘ఉగ్రవాదులకు సోదరిగా’ ఆయన పేర్కొంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.






