Big Alert : హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం

Mana Enadu : ‘డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు.. బేస్ జర పెంచి కొట్టు బాక్సులు పగిలేటట్టు’, ‘నువ్వు పెద్దపులి.. నువ్వు పెద్దపులి’, ‘మాయదారి మైసమ్మో మైసమ్మా.. మనం మైసారం పోదమే మైసమ్మ’….. పాటలు వింటుంటే మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో అర్థమైపోయింది కదా. ఇంకా దేని గురించి భీకర శబ్ధాలతో భూమి కంపించే సౌండు బాక్సులతో అదరగొట్టే డీజే గురించి. ఊరేగింపులు, వేడుకల సందర్భంగా డీజే పెట్టడం ఇప్పుడు కామన్ అయిపోయింది.

డీజే మోత మోగిస్తోంది

అంతెందుకు ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా.. చివరకు చావులకు కూడా డీజేతో సాగనంపుతున్నారు. ఇప్పుడు ప్రతి ఈవెంట్ డీజే అంత ముఖ్యమైపోయింది. ఇక రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు మొదలు కాబోతున్నాయి. మరోవైపు దేవీ శరన్నవరాత్రులు కూడా షురూ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో డీజే మోత మోగిపోనుంది. అయితే డీజే వల్ల కొందరు జాలీగా ఎంజాయ్ చేస్తారేమో కానీ చాలా మందికి ఆ శబ్ధం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.

హైదరాబాద్ లో డీజే నిషేధం

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులు డీజేలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. విపరీత శబ్ద కాలుష్యానికి దారితీస్తున్న డీజే  సౌండ్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్నామని డయిల్‌ 100కు ఫిర్యాదులు పెరగడంతో డీజేలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. డీజేల అంశంపై ఇటీవల బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో నగర కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగిన విషయం తెలిసిందే.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలే

రెండేళ్లుగా డీజేలతో పెద్దయెత్తున నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని ఈ సందర్భంగా సీవీ ఆనంద్ అన్నారు. అయితే అది ఈసారి శృతిమించి జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రె డ్డి సైతం దీన్ని గమనించి ఆరా తీశారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక నుంచి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పాషాఖాద్రీ.. డీజేల నిషేధానికి మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. 

Share post:

లేటెస్ట్