Mana Enadu : బ్రిటిష్ రాక్ మ్యూజిక్ బ్యాండ్ కోల్డ్ ప్లే (Cold Play) నిర్వహించే కన్సర్ట్ కు సంబంధించి బుక్‌మైషో (BookMyShow) బ్లాక్‌లో టికెట్లు విక్రయించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ సంస్థ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు అశీష్ హేమరాజని (Ashish Hemrajani)కి ముంబయి పోలీసులకు చెందిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్(EOW) సమన్లు జారీ చేసింది. గత వారమే తొలుత నోటీసులు ఇవ్వగా.. విచారణకు హాజరుకాకపోవడంతో తాజాగా మరోసారి నోటీసులు జారీ అయ్యాయి.
వచ్చే ఏడాది జనవరిలో 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం (DY Patil Stadium)లో కోల్డ్ ప్లే కన్సర్ట్ జరగనుంది. ఈ కన్సర్ట్‌కు అనూహ్య స్పందన రావడంతో బ్లాక్‌లో ఈ ప్రోగ్రామ్ టికెట్ల విక్రయం జరిగినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై న్యాయవాది అమిత్ వ్యాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కోల్డ్‌ప్లే టికెట్ ధర (Cold Play Concert) వాస్తవానికి రూ.2,500 ఉండగా.. థర్డ్ పార్టీ ద్వారా రూ.3 లక్షలకు విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు. కోల్డ్‌ప్లే అభిమానులను బుక్‌మై షో మోసం చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకుగానూ వీరిపై కేసు నమోదు చేయాలని కోరగా.. ముంబయి పోలీస్ ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) ఈ వ్యవహారంపై విచారణ షురూ చేసి ఇప్పటికే పలువురు బ్రోకర్లను గుర్తించింది.
మరోవైపు ఈ అంశంపై వెంటనే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసిన శివసేన (Shiv Sena) అభిమానుల నుంచి దోపిడీ చేయాలనే ఉద్దేశంతో టికెట్లను బ్లాక్ మార్కెట్లో విక్రయించి ఉండొచ్చని అభిప్రాయపడింది. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఇక ఈ వ్యవహారంపై బుక్‌మైషో ప్రతినిధి ఇది వరకే స్పందించింది.
‘కోల్డ్ ప్లే కన్సర్ట్ (Cold Play Concert Tickets) కోసం బుక్‌మైషోలో టికెట్ విక్రయాలు ప్రారంభమైన సెప్టెంబర్ 22న 1.2 మిలియన్ల మంది టికెట్ బుకింగ్ కోసం లాగిన్ అయ్యారని బుక్ మై షో తెలిపింది. ప్రతీ అభిమానికి టికెట్లు అందాలనే ఉద్దేశంతో ఒక్కో వినియోగదారుడు 4 టికెట్లు మాత్రమే కొనుగోలు చేసేందుకు పరిమితి విధించామని చెప్పింది. తాజాగా సమన్ల నేపథ్యంలో సీఈఓ ఈరోజు విచారణకు హాజరుకావాల్సి ఉంది.