Mana Enadu : “శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాత ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారు..? అసలు ఆదివారం రోజున మీరెందుకు పని చేయాలి..? సెలవుల్లో నోటీసులు ఇచ్చి.. ఎందుకు అర్జెంటుగా కూల్చేస్తున్నారు..? మీ పొలిటికల్ బాసులను సంతృప్తి పరచడానికి ఇలా అక్రమంగా కూల్చేస్తున్నారా..? ఇలా చేస్తే ఇంటికెళ్తారు జాగ్రత్త..” అంటూ హైడ్రా (Hydra) తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
సండే ఎందుకు పనిచేయాలి?
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో కూల్చివేతలపై పలువురు హైకోర్టు (High Court)ను ఆశ్రయించగా సోమవారం రోజున ధర్మాసనం ఈ వ్యవహారంపై విచారణ జరిపింది. ఈ విచారణకు హైడ్రా కమిషనర్ రంగానథ్ వర్చువల్‌గా, అమీన్‌పూర్ తహసీల్దార్ కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా శని, ఆదివారాల్లో కూల్చివేయొద్దని (Hydra Demolitions) గతంలో కోర్టు తీర్పులున్నాయని గుర్తు చేసిన హైకోర్టు.. కోర్టు తీర్పుల విషయం కూడా తెలియదా అని తహసీల్దార్‌ను ప్రశ్నించింది. గతంలో కూల్చివేసిన కేసుపై స్టే విధించిన విషయం తెలియదా? అని ప్రశ్నిస్తూ.. చట్టప్రకారం నడుచుకోకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని తహసీల్దార్‌ను హెచ్చరించింది.
కూల్చే ముందు చివరి ఛాన్స్ ఇచ్చారా?
ఈ సందర్భంగా హైకోర్టు (Telangana HC) తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు చెప్పినంత మాత్రాన అక్రమంగా ముందుకు వెళ్లొద్దని అధికారులకు హితవు పలికింది. ఇల్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా? అని ప్రశ్నించింది. ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తారా?’’ అని నిలదీసింది. వాదనల సందర్భంగా ఆదివారం కూల్చేయొచ్చా అని హైడ్రా కమిషనర్ (Hydra Ranganath)ను హైకోర్టు ప్రశ్నించగా.. కూల్చివేతకు యంత్రాలు, సిబ్బందిని కోరడంతో సమకూర్చామని రంగనాథ్ బదులిచ్చారు.
ఇలా చేస్తే స్టే ఇవ్వాల్సి వస్తుంది
దీనిపై హైకోర్టు మరింత తీవ్రంగా ఫైర్ అవుతూ.. చార్మినార్ (Charminar) కూల్చివేతకు తహసీల్దార్ యంత్రాలు, సిబ్బంది అడిగితే ఇస్తారా? అని ప్రశ్నించింది. హైడ్రా ఇదే విధంగా ముందుకు వెళ్తే స్టే ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది. ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా కూల్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది.
బాస్ ను మెప్పించేందుకే కూల్చివేతలా?
పొలిటికల్ బాస్‌లను సంతృప్తిపరిచేందుకు, పై అధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్ధంగా పని చేయొద్దని సూచించింది. చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక అడుగుతారన్న ఉన్నత న్యాయస్థానం ఆదివారం కూల్చివేతలు హైకోర్టు తీర్పునకు వ్యతిరేకమని తెలియదా అని హైడ్రా కమిషనర్ ను ప్రశ్నిస్తూ.. చట్టవ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికెళ్తారు.. జాగ్రత్త అని హెచ్చరించింది.