Mana Enadu : మీరు ఎక్కువగా బయట ఫుడ్ (Food) తింటున్నారా..? బ్రేక్ ఫాస్ట్ (Breakfast) మొదలు లంచ్, డిన్నర్, స్నాక్స్ ఇలా హోటళ్లు, రెస్టారెంట్లలోనే తింటున్నారా..? వంట చేసుకోవడం బద్ధకమయ్యో.. సమయం లేకనో ఆన్ లైన్ లో బయటి ఫుడ్ ఆర్డర్ (Online Food Order) చేసుకుంటున్నారా..? ఐతే జాగ్రత్తగా ఉండాల్సిందే. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యత ప్రమాణాల గురించి తెలిస్తే మీరు జన్మలో బయట ఫుడ్ తినరు. అసలు ఏం జరిగింది అంటే..?
ప్రజల ఆరోగ్యంతో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు చెలగాటమాడుతున్నాయి. ఆహార నాణ్యత ప్రమాణాలు (Food Safety Measurements) పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ విషయంలో తెలంగాణ వెనకబడి ఉందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు చెందిన భారతదేశ ఆహారభద్రత, ప్రమాణాల సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) తెలిపింది. వివిధ అంశాలను పరిశీలించి, మార్కుల ప్రాతిపదికగా నాణ్యత తనిఖీలపై 2023-24వ సంవత్సరానికి సంబంధించి నిర్దేశించిన మార్గదర్శకాల్లో పలు అంశాల్లో రాష్ట్రం వెనకబడి ఉన్నట్లు వెల్లడించింది.
100 మార్కులకు తెలంగాణ (Telangana) 35.75 మార్కులతో 23వ స్థానంలో ఉండగా.. అత్యధిక మార్కులతో కేరళ అగ్రస్థానంలో ఉండగా తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. జనాభాకు తగిన మేర ఆహార నాణ్యత తనిఖీ ఉద్యోగులు, సిబ్బంది లేకపోవడం వంటి అంశాల్లో రాష్ట్రం వెనకబడి ఉంది. అలాగే లైసెన్స్‌ల జారీకి స్పెషల్ డ్రైవ్‌లు, క్యాంపుల నిర్వహణ, కొత్త రిజిస్ట్రేషన్‌లు, నమూనాలను ప్రయోగశాలలో పరీక్షించడం, వినియోగదారుల ఫిర్యాదులు తీసుకోవడం, సహాయ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాల్లోనూ వెనకబడి ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఈట్ రైట్ ఛాలెంజ్ (Eat Right Challenge) కార్యక్రమాల నిర్వహణ, పరిశుభ్రత రేటింగ్‌ల నిర్వహణ పరిమితంగానే ఉన్నట్లు తెలిపింది.