Mana Enadu : ఫ్యామిలీ డిజిటల్ కార్డు (Family Digital Card)ల పైలట్ ప్రాజెక్టు నేటి (అక్టోబర్ 3వ తేదీ) నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 7వ తేదీ వరకు జరగనున్న ఈ కార్యక్రమం ద్వారా ఒకే రాష్ట్రం – ఒకే కార్డు (One State In Card) విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్, ఆరోగ్య సేవలతో పాటు సంక్షేమ పథకాలన్నీ కుటుంబ డిజిటల్ కార్డు ద్వారా అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది.
119 నియోజకవర్గాలు.. 238 ప్రాంతాలు
దీని ద్వారా ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేక నంబరుతో కార్డు ఇవ్వనున్నారు. రేషన్ కార్డు, రైతు బంధు (Rythu Bandhu), ఫించను తదితర సంక్షేమ పథకాల్లో డేటా ఆధారంగా ఇప్పటికే కుటుంబసభ్యుల వివరాలు గుర్తించాన సర్కార్.. పైలట్ ప్రాజెక్టులో భాగంగా నేటి నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకుంటారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని 238 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమం ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది.
సికింద్రాబాద్ లో ప్రారంభం
ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామీణ, ఒక పట్టణ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన అధికారులు.. పూర్తి గ్రామీణ ప్రాంతాలున్న నియోజకవర్గంలో రెండు గ్రామాలు, పూర్తిగా పట్టణ, నగర ప్రాంతాల్లో రెండు వార్డులు లేదా డివిజన్లను సెలెక్ట్ చేశారు. ఇందులో భాగంగా కుటుంబాలను నిర్ధారించడంతో పాటు కొత్త సభ్యులను చేర్చుతారు. మరణించిన వారి పేర్లు తొలగిస్తారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టును ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించనున్నారు.
కుటుంబంలోని ప్రధాన మహిళను యజమానిగా పేర్కొనాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కుటుంబంలోని ఇతర సభ్యుల వివరాలను కార్డు వెనుక ప్రచురించనున్నారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డు (PAN Card) వంటి వివరాలు అడగవద్దని ప్రభుత్వం అధికారులకు సూచించింది. పైలట్ ప్రాజెక్టును గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గ స్థాయిలో ఆర్డీవో, పట్టణ, నగర ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు.






