ManaEnadu: నా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నానంటూ మంత్రి కొండా సురేఖ.. సమంతకు క్షమాపణ చెప్పారు. ‘‘మహిళా నాయకుల పట్ల ఓ నాయకుడి చిన్నచూపు ధోరణి ప్రశ్నించాలన్నదే నా ఉద్దేశం. మీ మనోభావాలు దెబ్బ తీయాలని కాదు. స్వశక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం. మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైతే నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా’ అంటూ కొండా సురేఖ X లో పోస్ట్ చేశారు.
నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ @Samanthaprabhu2 మనోభావాలను దెబ్బతీయడం కాదు.
స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా..
— Konda Surekha (@iamkondasurekha) October 2, 2024
మంత్రి కొండా సురేఖ మెదక్ పర్యటన సందర్భంగా జరిగిన ఘటన, దానిపై బీఆర్‌ఎస్ పేరిట సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ జరిగింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఒక నూలు దండను మంత్రి సురేఖ మెడలో వేశారు. కొందరు ఈ ఫోటోను పెట్టి అసభ్య భావంతో ట్రోలింగ్ చేశారు. దీనిపై కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు.
సురేఖపై ట్రోలింగ్‌కు నిరసనగా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు, చేనేత కార్మీకులు తెలంగాణ భవన్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్ చేస్తూ కొండా సురేఖను విమర్శించారు. తనను ట్రోల్ చేశారంటూ సురేఖ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని వ్యాఖ్యానించారు. అనంతరం కొండా సురేఖ తీవ్రంగా స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.